మొక్క మొక్కకో కర్ర!
దుగ్గొండి: మోంథా తుపాను రైతును నిలువునా ముంచేసింది. వరి, పత్తి, అరటి, మిరప తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాత దశలో ఉన్న మిరప తోటలు నేలవాలడంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. అయితే, ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. శ్రమ అయినా సరే తోటను కాపాడుకోవాలని సంకల్పించాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన రైతు ఆవుల నర్సింహారెడ్డి మీటరు పొడవు ఉన్న కర్రలను సమకూర్చాడు. తన మిరప తోటలో నేలవాలిన ప్రతి మొక్కకు ఒక కర్రను కట్టాడు. ఇలా తనకున్న ఎకరం తోటను కాపాడుకోవడానికి రోజుకు ఆరుగురు కూలీలతో రెండు రోజులపాటు కర్రలను పాతి తోటను బతికించాడు. దుగ్గొండి–గిర్నిబావి ప్రధాన రహదారి పక్కన శివాజీనగర్ సమీపంలో ఉన్న ఈ తోటను అటువైపు వెళ్తున్న వారు ఆసక్తిగా తిలకిస్తున్నారు.


