రికార్డుస్థాయిలో వర్షపాతం
సాక్షి, వరంగల్: జిల్లాలో రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. గత ఐదేళ్లలో అక్టోబర్ నెలలో కురిసిన అతి భారీ వర్షపాతం ఇదేనని వాతావరణ విభాగాధికారులు తెలిపారు. ఈ అక్టోబర్‌లో 353.2 మిల్లీమీటర్ల జిల్లా సగటు వర్షపాతం నమోదైతే.. బుధవారం ఉదయం (అక్టోబర్ 29వ తేదీ) 8.30 నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు ఒక్క రోజులోనే 246.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందని వారు పేర్కొన్నారు. అక్టోబర్‌లో జిల్లా సగటు వర్షపాతం 2021లో 38.2 మిల్లీమీటర్లు, 2022లో 142.6 మిల్లీమీటర్లు, 2023లో 10.9 మిల్లీమీటర్లు, 2024లో 88.5 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. మొంథా తుపాను ప్రభావంతో ఒక్కసారిగా ఈ ఏడాది అక్టోబర్‌లో 353.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
ఈ సీజన్‌లో 29 శాతం వాన అదనం..
జూన్‌లో 153.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 113.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలైలో 271.9 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 312.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే జూన్‌లో 26 శాతం లోటు వర్షపాతం ఉండగా, జూలైలో 15 శాతం అదనంగా వర్షం కురిసింది. ఆగస్టు ఒకటి నుంచి 31వ తేదీ వరకు 248.3 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 390.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సెప్టెంబర్‌లో 174.9 మిల్లీమీటర్ల వర్షం కురవల్సి ఉండగా 245.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తగా చూసుకుంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో 854 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 1,102.4 మిల్లీమీటర్లు కురిసింది. అంటే 29 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది.


