ఒడ్డున పడని కష్టాలు..
సాక్షిప్రతినిధి, వరంగల్: అకాల వర్షం.. వరదలతో వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల కష్టాలు ఒడ్డుకు చేరడం లేదు. ప్రధానంగా గ్రేటర్ వరంగల్ నగరం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో ఉప్పొంగిన వరదలు ప్రజలను అతలాకుతలం చేశాయి. వరదలతో గండ్లు పడిన చెరువులు, జలమయమైన జనావాసాలు, దెబ్బతిన్న రహదారులతో జనజీవనానికి కలిగిన అంతరాయాలు ఇప్పుడిప్పుడే తొలగుతున్నాయి. వరద ప్రభావిత నాలుగు జిల్లాల్లో చాలా చోట్ల మునిగిపోయిన పంటచేలు ఇంకా తేలలేదు. రికార్డుస్థాయిలో కురిసిన వర్షాల వల్ల వరద దెబ్బ నుంచి వరంగల్ మహానగరం ఇంకా తేరుకోవడం లేదు. ముంపునకు గురైన 78 కాలనీల్లో చాలా వరకు కాలనీలు ఇంకా నీరు, బురదమయంగానే ఉన్నాయి. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల పర్యటన తర్వాత వరద నష్టం అంచనాకు అధికారయంత్రాంగం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది.
పంట నష్టం ఇంకా పెరిగే అవకాశం...
భారీ వర్షం, వరదలకు వరి, పత్తి సహా పలు పంటలకు నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాశులు తడిసిపోయాయని రైతులు ఇంకా కన్నీరుమున్నీరవుతున్నారు. క్షేత్రస్థాయి సర్వేకు వెళ్లిన అధికారులతో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కాగా, మోంథా ప్రభావంతో సుమారు 1,29,228 మంది రైతులకు చెందిన 2.16 లక్షల ఎకరాల్లో వేసిన వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, ఇతర పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఒక్క వరంగల్ జిల్లాలోనే 80,500 మంది రైతులకు చెందిన 1,30,000 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న ఇతర పంటలు నేలమట్టమయ్యాయి. హనుమకొండ జిల్లాలోనే 34,820 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. జనగామ జిల్లాలో 25,796 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇలా మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 2.62 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. సీఎం పర్యటన తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుండగా ఆ అంచనా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కాగా, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో వరదలకు పంటలు కాకుండా 221 చోట్ల ఆర్‌అండ్‌బీ, పీఆర్ రోడ్లు తెగిపోయినట్లు చెబుతున్నారు. ఎన్పీడీసీఎల్ వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాల్లో 65 చోట్ల విద్యుత్ సబ్‌స్టేషన్లు దెబ్బతినగా చాలాచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తుపాను ప్రభావం వల్ల ఉమ్మడి వరంగల్‌లో నష్టం రూ. వెయ్యికోట్లకుపైనే ఉంటుందన్న చర్చ జరగుతోంది
రెండు రోజుల్లో సీఎం రేవంత్‌కు నివేదికలు...
సీఎం ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్‌లో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఉరుకులు, పరుగుల మీద వరద నష్టం అంచనా వేస్తున్నారు. శనివారం ఉదయం నుంచి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్న అన్ని శాఖల అధికారులు సోమవారం నాటికి నివేదికలు సిద్ధం చేసేలా కలెక్టర్లు ఫాలోఅప్ చేస్తున్నారు. కలెక్టర్లతో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆరా తీస్తున్నారు. నివేదికలు పూర్తి కాగానే ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సమీక్ష తర్వాత.. సీఎంను కలిసి నివేదించనున్నారు.
‘మోంథా’ షాక్ నుంచి ఇంకా తేరుకోని జనం
నష్టం అపారం.. సాయం ఏమాత్రం?
క్షేత్రస్థాయికి వ్యవసాయ, రెవెన్యూ, మున్సిపల్ శాఖలు
వరద నష్టం అంచనాల్లో
అధికారులు, సిబ్బంది


