రైతులు ఆందోళనకు గురికావొద్దు
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
నెక్కొండ/పర్వతగిరి: మోంథా తుపానుతో పంటలు నష్టపోయిన రైతులు ఆందోళనకు గురికావొద్దని, ప్రభుత్వం పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. నెక్కొండ మండలంలోని రెడ్లవాడ, వెంకటాపురం, పర్వతగిరి మండలం చింతనెక్కొండలో శనివారం కలెక్టర్ పర్యటించి వర్షానికి దెబ్బతిన్న పంటలు, ధ్వంసమైన రోడ్లు, కూలిపోయిన ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంటలను సర్వే చేసి నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు అధైర్యపడొద్దని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని భరోసా ఇచ్చారు. అలాగే, నెక్కొండ పీహెచ్‌సీ పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. వర్షాలతో ప్రజలు వ్యాధులబారిన పడకుండా గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా రోడ్లు, భవనాల అధికారి రాజేందర్, నర్సంపేట ఏడీఏ దామోదర్‌రెడ్డి, పీఆర్ డీఈ మోహన్‌రావు, ఐబీ డీఈ సంతోష్, నెక్కొండ తహసీల్దార్ రాజ్‌కుమార్, నెక్కొండ ఎంపీడీఓ లావణ్య, పర్వతగిరి ఏఓ ప్రశాంత్, చింతనెక్కొండ పంచాయతీ కార్యదర్శి యాకూబ్ ఉన్నారు.
వరద నష్టాలపై నివేదికలు ఇవ్వండి
న్యూశాయంపేట: భారీ వర్షాలు, వరదలతో కలిగిన నష్టాలపై శాఖల వారీగా నివేదికలు తయారు చేసి సమర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖిలావరంగల్, వరంగల్‌లో ఇంటింటికి వెళ్లి నష్టం వివరాలను నమోదు చేసి సోమవారం నాటికి నివేదిక సమర్పించాలన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి పాల్గొన్నారు.
రైతులు ఆందోళనకు గురికావొద్దు


