సమయపాలన పాటించని ఉద్యోగులు, అధికారులు | - | Sakshi
Sakshi News home page

సమయపాలన పాటించని ఉద్యోగులు, అధికారులు

Oct 27 2025 7:03 AM | Updated on Oct 27 2025 7:03 AM

సమయపా

సమయపాలన పాటించని ఉద్యోగులు, అధికారులు

వరంగల్‌ అర్బన్‌: తాళం వేశారు.. గొళ్లెం మరిచారు అన్న చందంగా మారింది వరంగల్‌ మహానగర పాలక సంస్థ పరిస్థితి. ప్రజాకార్యకలాపాలు ఈ–ఆఫీస్‌ ద్వారా కొనసాగిస్తున్న యంత్రాంగం హాజరు విధానంలో నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. కేవలం ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకే బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ అమలు చేస్తున్నారు. కానీ, ఉద్యోగులు, అధికారుల విషయంలో హాజరు పుస్తకాలతో కాలం వెళ్లదీస్తున్నారు. వారి రాకపోకలపై మేయర్‌, కమిషనర్‌ జారీ చేసిన ఆదేశాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడనే విమర్శలు ఉన్నాయి. నెల రోజుల్లోగా అందరికీ బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ ఉండాలని రెండు నెలల క్రితం హెచ్చరించినా ఇంత వరకు అమలు చేయలేదు. దీంతో వరంగల్‌ బల్దియా ప్రధాన కార్యాలయం, కాజీపేట, కాశిబుగ్గ సర్కిల్‌ కార్యాలయాల్లో పనితీరు అస్తవ్యస్తంగా మారింది. సమయపాలన పాటించాలనే నిబంధనను ఎవరూ పట్టించుకోవడం లేదు.

ప్రజలకు తప్పని ఇబ్బందులు

అడిగేవారు లేక ప్రధాన కార్యాలయంలో పని చేసే సిబ్బంది, అధికారులు ఇష్టారాజ్యంగా విధులకు హాజరవుతున్నారు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వస్తున్న పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2013లో అప్పటి కమిషనర్‌ వివేక్‌యాదవ్‌ బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. బయోమెట్రిక్‌ మిషన్‌ను ఆన్‌లైన్‌కు అనుసంధానం చేయించారు. అధికారులు, ఉద్యోగుల అటెండెన్స్‌ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు బల్దియాకు చెందిన ‘అవర్‌ జీడబ్ల్యూఎంసీ’ వెబ్‌సైట్‌ ఏర్పాటు చేయించారు. విధుల్లో చేరేముందు బయోమెట్రిక్‌ మిషన్‌పై ఫింగర్‌ ప్రింట్‌ వేసిన అధికారులు, ఉద్యోగుల వివరాలు ఎప్పటికప్పుడు ‘ఆన్‌లైన్‌’లో నమోదవుతాయి. జీతాలు తీసుకునేందుకు ఈవిధానం ఎంతగానో దోహదపడింది. పౌరులు సైతం ‘అవర్‌ జీడబ్ల్యూఎంసీ’ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వారి హాజరును పరిశీలించారు. కమిషనర్‌, ఇతర ఉన్నతాధికారులు ఎక్కడి నుంచైనా ఒక్క క్లిక్‌తో హాజరును తెలుసుకున్నారు.

బయోమెట్రిక్‌ హాజరును లెక్కించాలి..

బయోమెట్రిక్‌ హాజరును లెక్కిస్తే సిబ్బంది, అధికారులు సమయానికి వస్తారు. పనుల్లో నిమగ్నం కావడం, పరస్పర అవగాహన, సమన్వయం ఉంటుంది. అధికారులు, సిబ్బందిలో బాధ్యత పెరుగుతోంది. నగర పౌరులకు సకాలంలో సేవలు లభిస్తాయి. అధికారులు, ఉద్యోగులు బాధ్యతారహితంగా విధులు నిర్వర్తిస్తున్నారని డిప్యూటీ కమిషనర్లను వివరణ కోరగా.. ఫీల్డ్‌ మీద విధులు నిర్వర్తిస్తున్నామని, ఒకవేళ ఎవరైనా విధుల్లోకి రాకపోతే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

బయోమెట్రిక్‌ విధానాన్ని తొలుత అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌కు పరిమితం చేసి దశలవారీగా అన్ని విభాగాలకు విస్తరించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, బల్దియాలోని శాశ్వత ఉద్యోగులు, అధికారులకు బయోమెట్రిక్‌ అనుసంధానం నుంచి జీతాల లెక్కింపు మినహాయింపు జరుగుతోంది. ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు, ఉద్యోగులకు మాత్రమే బయోమెట్రిక్‌ విధానం వర్తిస్తోంది. దీంతో కొంతమంది సూపరింటెండెంట్లు, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, అటెండర్లు, అధికారులు చుట్టపుచూపుగా కార్పొరేషన్‌ కార్యాలయానికి చేరుకుని బయోమెట్రిక్‌పై వేలిముద్రలు వేసి మొహం చాటేస్తున్నారు. చాలామంది తమకు వీలైన సమయంలో కార్యాలయానికి చేరుకుని వేలిముద్రలు వేసి అక్కడి నుంచి నిష్క్రమించి సొంత పనుల్లో నిమగ్నమవుతున్నారు. మరికొంత మంది పనులు పక్కన పెట్టి కార్యాలయం, ఎదుట ఉన్న చెట్ల కింద, హోటళ్లలో కాలక్షేపం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఎప్పడోస్తారో, ఎప్పడు పోతారో, అసలు వస్తారో రారో తెలియని అయోమయ పరిస్థితి ఉంది. మరికొందరు విధుల్లోకి రాకుండా సంబంధిత వింగ్‌ అధికారులను మచ్చిక చేసుకుని దర్జాగా జీతాలు పొందుతున్నారని చర్చ జరుగుతోంది. సిబ్బంది లేకపోవడంతో కార్యాలయానికి వివిధ పనుల కోసం వస్తున్న ప్రజలు విసిగి వేసారిపోతున్నారు.

ప్రధాన, సర్కిల్‌ కార్యాలయాల్లో

పర్యవేక్షణ కరువు

ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకే పరిమితమైన బయోమెట్రిక్‌

అమలుకు నోచుకోని

మేయర్‌, కమిషనర్‌ ఆదేశాలు

సమయపాలన పాటించని ఉద్యోగులు, అధికారులు1
1/1

సమయపాలన పాటించని ఉద్యోగులు, అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement