నీటి సరఫరాలో అవాంతరాల్లేకుండా చూడాలి
వరంగల్ అర్బన్: తాగునీటి సరఫరాలో అవాంతరాలు లేకుండా చర్యలు చేపట్టాలని మేయర్ శ్రీమతి గుండు సుధారాణి ఆదేశించారు. హనుమకొండ కేయూ, దేశాయిపేటలోని ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్లను మేయర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నీటి సరఫరా తీరు, నీటి నాణ్యతను గురించి అధికారులను అడిగి తెలుసుకుని సమర్థంగా నిర్వహించేందుకు సూచనలిచ్చారు. ఈసందర్భంగా నీటి నాణ్య తను పరిశీలించిన అనంతరం మేయర్ మాట్లాడుతూ.. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి వచ్చే రా వాటర్‌లో సమస్య ఏర్పడిందని వర్షాకాలం ముగింపు సమయంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందన్నారు. గతేడాది కూడా ఈ సమస్య ఉత్పన్నమైందని, శనివారంతో పోలిస్తే ప్రస్తుతం నీటి సరఫరా బాగానే జరుగుతోందన్నారు. పూర్తిగా సమస్యను పరిష్కరించి నేటి (సోమవారం) నుంచి శుద్ధమైన నీటిని సరఫరా చేయనున్నట్లు మేయర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి ఈఈ రవికుమార్, డీఈ సతీశ్, ఏఈ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: సాదాబైనామా దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో వర్ధన్నపేట, దుగ్గొండి మండలాలకు సంబంధించిన భూ భారతి, పీఓబీ రికార్డులు పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి పరిశీలన నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. దరఖాస్తు తిరస్కరణకు గురైతే అందుకు కారణాల్ని స్పష్టంగా పేర్కొనాలన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం చేయకుండా రోజువారీగా పరిశీలన వేగవంతం చేసేందుకు కృషిచేయాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పారదర్శకత కీలకమన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో తహసీల్దార్లు రాజేశ్వర్, విజయ్‌సాగర్, కలెక్టరేట్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఫార్మాస్యూటికల్ సైన్స్ కళాశాలలో బీఫార్మసీ కోర్సులో ఈనెల 28న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జె.కృష్ణవేణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. టీజీఎప్‌సెట్–2025 మార్గదర్శకాల ప్రకారం.. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అందుబాటులో ఉన్న ఖాళీ సీట్ల కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫీజుతో కాకతీయ యూనివర్సిటీలోని ఫార్మసీ కాలేజీలో ఈనెల 28న మధ్యాహ్నం 2 గంటలకు స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావాలని సూచించారు. వేకెన్సీ సీట్లు 9 ఉన్నాయని.. ట్యూషన్ ఫీజు రూ.45 వేలు, స్పాట్ ఫీజు అర్హత కలిగిన అభ్యర్థులకు రూ.1,300 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. స్పాట్ అడ్మిషన్ల ద్వారా ప్రవేశాలు పొందిన వారు ట్యూషన్ ఫీజు, రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు కాదని ప్రిన్సిపాల్ కృష్ణవేణి తెలిపారు.
వరంగల్ అర్బన్: వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించనున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం నగర ప్రజలు గ్రీవెన్స్ సెల్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
వరంగల్ కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ రద్దు
న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌ను రద్దు చేసినట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరిపాలనాపరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి వినతులు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని కోరారు.
నీటి సరఫరాలో అవాంతరాల్లేకుండా చూడాలి


