సమస్యలు పరిష్కరించాలని ధర్నా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని హాస్టళ్ల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. గురువారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో క్యాంపస్‌లోని పరిపాలనా భవనం వీసీ చాంబర్ వద్ద విద్యార్థులు ధర్నా చేశారు. ఈసందర్బంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ.. హాస్టళ్ల డైరెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవట్లేదని ఆరోపించారు. న్యూ పీజీ బాయ్స్ హాస్టల్, జగ్జీవన్ హాస్టల్ విద్యార్థులకు సరైన వసతుల్లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇద్దరు జాయింట్ డైరెక్టర్లు తమ సమస్యల్ని పట్టించుకోవట్లేదన్నారు. న్యూ పీజీ హాస్టల్ వద్ద నిర్మించిన డైనింగ్ హాల్ మెస్‌ను ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. కామన్ మెస్‌లోనూ, మహిళా హాస్టల్స్ మెస్‌లోనూ మెనూ చార్టును అమలు చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిచాలన్నారు. తప్పుడు లెక్కలు, అధిక బిల్లుల విషయంలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళన కొనసాగుతుండగా.. వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి అక్కడికి వచ్చి సంఘం బాధ్యులతో మాట్లాడారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆరోపణలపై విచారణ జరిపిస్తామన్నారు. దీంతో వారు ఆందోళన విరమించారు. ధర్నాలో రణదీప్, రాహుల్, సూరజ్, నాగరాజ్, రాజేశ్, సునీల్, పవన్, అనూప్ పాల్గొన్నారు.


