
శంకర్ దాదాలు @ ఇందిరమ్మ కాలనీ
హన్మకొండ అర్బన్ : హనుమకొండ 49వ డివిజన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కొద్దిరోజులుగా శంకర్‌దాదాలు రాజ్యమేలుతున్నారు. వివిధ ప్రాంతాలనుంచి ఇక్కడికి వచ్చి ఇల్లు నిర్మించుకున్న వా రు ఒక ముఠాగా ఏర్పడి ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒకరి ప్లాట్ ఇంకొకరికి విక్రయించడం, అసలు యజమానిని బెదిరించి మరొక ప్లాట్ ఇవ్వడం వంటివి ఇక్కడ సర్వసాధారణం అయ్యాయని తెలుస్తోంది. ఎవరైనా ఎదురు తిరిగితే భౌతిక దాడులకు సైతం పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి వరుస ఘటనలతో కాలనీవాసులు బెంబేలెత్తిపోతున్నారు.
మేం చెప్పిన చోటే ఇల్లు నిర్మించుకోవాలి..
కాలనీలో బరితెగించిన ఓ ముఠా ఖాళీ ప్లాట్లపై కన్నెస్తోంది. ఆ ప్లాట్‌ను ఎవరికో ఒకరికి అంటగడుతూ..అసలు ఓనర్ వచ్చి అది తనదంటే బెదిరించి వెళ్లగొడుతున్నారు. గట్టిగా తిరగబడితే ఇంతకాలం ఇక్కడ లేవు.. కాబట్టి ఆ ప్లాట్ వేరే వాళ్లకు ఇచ్చేశాం.. మీకు ఇంకోచోట చూపిస్తాం అంటూ వేరే చోట ప్లాట్‌ను వీరికి అంటగడుతున్నారు. అక్కడే ఇల్లు నిర్మించుకోవాలని చెబుతున్నారు. అందుకుగాను అటు ప్లాటు ఓనర్‌నుంచి ఇటు కొత్తగా కొనుగోలు చేసినవారి నుంచి రూ.లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారు. ఇలా ఇద్దరి వద్ద వసూలు చేస్తున్న నగదుతో జల్సాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంపై పలుమార్లు రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శృతిమించిన రౌడీయిజం
కాలనీలో కొందరు తమకు రాజకీయ నేతలు, పోలీసుల అండదండలు ఉన్నాయని చెప్పుకుంటూ చలామణి అవుతుండటం వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా ఓ డీసీసీ మాజీ అధ్యక్షుడి అనుచరుడిని అంటూ కాలనీలో ఓ వ్యక్తి హంగామా చేస్తున్నాడు. కొందరిని ఏకంగా చంపుతానంటూ బహిరంగంగా బెదిరించడం, దేవుడి వద్ద ప్రమాణాలు చేయడం కాలనీలో తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. ఇటీవల సదరు వ్యక్తి కాలనీలోని కొందరు తన బండికి అడ్డుగా నిలబడ్డారని ఆగ్రహంతో మైనర్లను విచక్షణ రహితంగా చితకబాదిన ఘటన సీసీ ఫుటేజీలతో సహా వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. పోలీసులు మాత్రం కొందరికి వత్తాసుగా మాట్లాడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. బాధితులు పోలీస్ స్టేషన్‌కి వెళ్తే ఉదయం రమ్మని చెప్పిన పోలీసులు వారి మీదనే గొలుసు దొంగతనం కేసు పెడతామంటూ బెదిరించినట్లు ఆరోపిస్తున్నారు. ఆ గొలుసు రాత్రిపూట తమకు దొరికిందని ఇస్తామంటే ఉదయం పట్టుకు రమ్మని చెప్పారని, తీరా ఉదయం మాత్రం దొంగతనం చేశారని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్లాట్ల కబ్జాలపై పోలీస్, రెవెన్యూ అధికారులు సీరియస్‌గా దృష్టి సారించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
ప్లాట్ల కబ్జా..అడిగితే దౌర్జన్యం..
భౌతిక దాడులు
రాజకీయ నేతల పేర్లతో చలామణి
పోలీసుల అండ ఉందని ధీమా