
యాదృచ్ఛికమా.. అధికారుల నిర్లక్ష్యమా..?
● నర్సంపేట సబ్ జైల్లో గతంలో ఇద్దరు ఖైదీల మృతి
● నెలల వ్యవధిలోనే ఘటనలు
● ప్రజలను తొలుస్తున్న అనేక ప్రశ్నలు
నర్సంపేట: నర్సంపేట మహిళా సబ్ జైల్లో ఇటీవల రిమాండ్‌లో ఉన్న ఇద్దరు ఖైదీలు మృతి చెందడం కలకలం రేపుతోంది. అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాతే జైల్లోకి అనుమతిస్తారు. అలాంటిది ఒకే జైల్లో నెలల వ్యవధిలో ఇద్దరు మహిళా ఖైదీలు మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా.. అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందా..? అనే ప్రశ్నలు ప్రజలను తొలుస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం ఖైదీలు అనారోగ్యంతోనే మృతి చెందినట్లు పేర్కొంటున్నారు.
చికిత్స పొందుతూ మృతి
జైలు శిక్ష అనుభవిస్తున్న క్రమంలో రెండు మూడు రోజుల్లోనే అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేర్చిన మరుసటి రోజే ఇద్దరు మహిళలు మృతి చెందారు. హనుమకొండ జిల్లా సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఓ కేసులో నిందితురాలైన పెండ్యాల సుచరిత జైల్లో బాత్రూంకు వెళ్లి కింద పడిపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలోనే మృతి చెందినట్లు జైలర్ లక్ష్మిశృతి తెలుపగా ఆమె నిర్లక్ష్యం వల్లనే మహిళా ఖైదీ మృతి చెందిందనే నెపంతో సస్పెండ్ చేశారు. తాజాగా శిశు విక్రయాల కేసులో సబ్ జైలుకు వచ్చిన కరీంనగర్ జిల్లా రాంపూర్‌కు చెందిన కల్పన ఎంజీఎంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. నర్సంపేట సబ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు రెండు నెలల వ్యవధిలో మృతి చెందడం చర్చనీయాంశమైంది. అయితే ఆమె ఆరోగ్యం బాగాలేదని, ఆస్పత్రికి తీసుకెళ్లామని చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఆమె జైలుకు వచ్చిన 16రోజుల పాటు మౌనంగానే ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లామని తెలిపారు. జైలుకు వచ్చే ముందు చేసిన ఆరోగ్య పరీక్షల్లో ఆరోగ్యం బాగానే ఉందని.. జైలుకు వచ్చిన తర్వాత మౌనంగా ఉండడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలుసుకొని చికిత్స చేయించినట్లు తెలిపారు.
ఏం జరిగి ఉంటుంది..
మహిళా జైలులో నెల వ్యవధిలో ఇద్దరు చనిపోవడంతో ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. జైల్లో ఫుడ్ పాయిజన్ వంటి ఘటనలు జరుగుతున్నాయా.. లేదా అధికారుల తప్పిదమా.. నిజంగానే అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందతున్నారా.. అనే కోణంపై పూర్తిస్థాయి విచారణ చేస్తే నిజాలు బయటకు వచ్చే అవకాశాలు లేకపోలేదు.

యాదృచ్ఛికమా.. అధికారుల నిర్లక్ష్యమా..?