
కుటుంబ వ్యవస్థను కాపాడాలి
రామన్నపేట: కుటుంబ వ్యవస్థను పరిరక్షించాల్సిన బాధ్యత మహిళా పోలీసులపై అధికా రులపై ఉందని క్రైం ఏసీపీ సదయ్య సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రంగంపేటలోని మహిళా పోలీస్‌స్టేషన్‌ను క్రైం ఏసీపీ శనివారం సందర్శించారు. తనిఖీల్లో భాగంగా స్టేషన్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించడంతో పాటు కేసులకు సంబంధించిన సీడీ ఫైళ్లను పరిశీలించారు. పెండింగ్ కేసులు, ప్రస్తు తం దర్యాప్తులో కేసులు, నిందితుల అరెస్టు సంబంధించిన వివరాలను స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సూర్యప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శాఖాపరమైన సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ భార్యాభర్తల మధ్య జరిగే గొడవలపై స్టేషన్‌కు వచ్చే బాధితులకు సరైన కౌన్సెలింగ్ నిర్వహించి వారి మధ్య సఖ్యత కుదర్చడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. మహిళా బాధితులకు సరై న న్యాయం అందించాలని ఏసీపీ తెలిపారు.
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్‌లో శనివారం స్థానిక సంస్థల ఎన్నికల సహాయక కేంద్రాన్ని కలెక్టర్, ఎన్నికల అధికారి స్నేహ శబరీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ముగిసేదాకా 24 గంటలు సహాయక కేంద్రం పనిచేస్తుందని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సహాయక కేంద్రం 7981975495కి నంబర్‌కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు.
కాజీపేట: స్థానిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో హనుమకొడ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం స్వీకరించే దరఖాస్తుల ప్రక్రియ నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసే దాకా ప్రజావాణి ఉండదని జిల్లా ప్రజలు గుర్తించాలని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో ఐదేళ్ల లా కోర్సు మూడో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 9వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆసింఇక్బాల్ తెలిపారు. ఈనెల 9న మొదటి పేపర్, 13న రెండో పేపర్, 15న మూడో పేపర్, 17న నాలు గో పేపర్ ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.
మేయర్ గుండు సుధారాణి
రామన్నపేట: నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా శనివారం మోడల్ 29వ డివిజన్‌లో కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి ప్రజలకు చెత్త డబ్బాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా 29వ డివిజన్‌ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. గ్రేటర్‌లోని 66 డివిజన్లలో కూడా అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటి వద్దే తడి చెత్తను ప్రాసెసింగ్ చేస్తే 21 రోజుల త్వరాత కంపోస్టు ఎరువు తయారు అవుతుందన్నారు. సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, శానిటరీ సూపర్‌వైజర్ గోల్కొండ శ్రీను, భద్రకాళి దేవస్థాన ధర్మకర్త పూర్ణ తదితరులు పాల్గొన్నారు.
జంక్షన్లను ఆధునికీకరించాలి..
వరంగల్ అర్బన్: నగరంలో జంక్షన్ల ఆధునీకరణ, నిర్వహణ పక్కాగా జరగాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. శనివారం అలంకార్, జవహర్‌కాలనీ, వడ్డేపల్లి, ఫాతిమానగర్ జంక్షన్లలో పూర్తయిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కూడళ్ల నిర్వహణపై నిర్లక్ష్యం వద్దని ఆదేశించారు.

కుటుంబ వ్యవస్థను కాపాడాలి