
ముసాయిదా విడుదల
హన్మకొండ: హనుమకొండ జిల్లా పరిషత్ పరిఽధిలో పోలింగ్ స్టేషన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఓటర్ల వివరాల్ని జెడ్పీ ఇన్‌చార్జ్ సీఈఓ బి.రవి, మండలాల్లో మండల అభివృద్ధి అధికారులు శనివారం విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 6న జిల్లా పరిషత్ పరిధి ఎంపీటీసీలు, జెడ్పీటీసీల వివరాలు పోలింగ్ స్టేషన్ల వివరాలు ప్రదర్శించాలని షెడ్యూల్‌లో పేర్కొంది. ఈమేరకు శనివారం వివరాలు జెడ్పీ, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. ఈనెల 8న జిల్లాలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని, అదేవిధంగా అభ్యంతరాలు స్వీకరించాలని, వచ్చిన అభ్యంతరాల్ని ఈనెల 9న పరిష్కరించాలని, 10న తుది జాబితా ప్రదర్శించాలని ఎన్నికల సంఘం షెడ్యూల్‌లో పేర్కొంది. హనుమకొండ జిల్లా పరిధిలో 12 జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, 129 మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం ఓటర్లు 3,70,871 ఉండగా పురుషులు 180666, మహిళలు 190201, ఇతరులు నలుగురు ఉన్నారు. ఎల్కతుర్తి, హసన్‌పర్తి, ఐనవోలు, శాయంపేటలో ఒకరి చొప్పున ఇతరులున్నారు. జిల్లాలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళలు 9,535 మంది అధికంగా ఉన్నారు. ప్రతీ మండలంలోనూ మహిళా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండడం విశేషంగా చెప్పవచ్చు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో 631 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలను మండలానికి ఒకటి చొప్పున గుర్తించారు.
10న తుది జాబితా ప్రదర్శన
జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ