
‘ఆపరేషన్ ముస్కాన్’ను పకడ్బందీగా నిర్వహించాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్‌ను పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్నారుల సంక్షేమమే ధ్యేయంగా ఈనెల 1నుంచి 31వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 11వ విడత ఆపరేషన్ ముస్కాన్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బాలకార్మికులకు భిక్షాటన, వెట్టిచాకిరిల నుంచి విముక్తి కల్పించి వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలకార్మికులను గుర్తించి బాలసదన్‌లో చేర్పించాలని చెప్పారు. బడికి దూరంగా ఉన్న పిల్లలు, మధ్యలో మానేసిన పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, జిల్లా సంక్షేమాధికారి రాజమణి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ వసుధ పాల్గొన్నారు.