
ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ నియామకాలు అమలులోకి వచ్చాయి. పూర్తి స్థాయి నియామకాలకు మంగళం పాడిన యాజమాన్యం సిబ్బంది లోటును పూడ్చడానికి తాత్కాలిక నియామకాల వైపు మొగ్గు చూపింది. ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాల నియామకం చేపట్టనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ పలు మార్లు ప్రకటనలు చేశారు. ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా.. డ్రైవర్, కండక్టర్ల ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా చేపట్టనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అందుకు భిన్నంగా యాజమాన్యం ఔట్ సోర్సింగ్ నియామకాల కోసం జారీ చేసిన సర్క్యులర్ రీజియన్ కార్యాలయాలకు చేరింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ల నియామక సర్క్యులర్ ముందుగా, కండక్టర్లకు సంబంధించి తర్వాత జారీ అయ్యాయి. వరంగల్ రీజియన్‌లో ఇప్పటికే 30 మంది డ్రైవర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టి శిక్షణ ఇస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్ ఆర్‌ఎం డి.విజయభాను తెలిపారు. మరో 70 మంది డ్రైవర్లను తీసుకునేందుకు సన్నద్ధం అవుతున్నారు.
మ్యాన్ పవర్ అందించే ఏజెన్సీల ద్వారా..
ఔట్ సోర్సింగ్ నియామకాలు మ్యాన్ పవర్ అందించే ఎజెన్సీల ద్వారా చేపట్టనున్నారు. ఆర్టీసీకి చెందిన డిప్యూటీ రీజినల్ మేనేజర్లతో కూడిన కమిటీ డ్రైవర్ల నియామకాన్ని చేపడుతోంది. డ్రైవర్ ఉద్యోగానికి చదవడం, రాయడం వస్తే సరిపోతుంది. హెవీ డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు 18 నెలల అనుభవం ఉండాలి. వయసు 60 ఏళ్లు లోపు వారు అర్హులు. ఎంపిక కమిటీ ముందుగా డ్రైవింగ్ లైసెన్స్, అనుభవాన్ని పరిశీలించిన తర్వాత డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో సంతృప్తి చెందిన అధికారులు వారిని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ నిర్వహించి ఫిట్‌నెస్ కలిగి ఉన్న వారిని ఎంపిక చేసి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి విధుల్లోకి తీసుకుంటారు. అదే విధంగా కండక్టర్ల నియామకాన్ని ఎంపిక కమిటీ చేపడుతుంది. ఎస్సెస్సీ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై, వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు. వీరి నియామకానికి మ్యాన్ పవర్ అందించే ఎజెన్సీ రూ.2లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. డ్రైవర్లకు నెలకు రూ.22 వేలు జీతం ఇవ్వనుండగా, కండక్టర్లకు రూ.17,969 వేతనం చెల్లిస్తారు. ఎంపికై న వారు రవాణా శాఖ ద్వారా కండక్టర్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది.
సిబ్బంది లోటు తీర్చేందుకు తాత్కాలిక చర్యలు
వరంగల్ రీజియన్‌లో ఇప్పటికే
30 మంది డ్రైవర్ల నియామకం
మరో 70 మంది డ్రైవర్లు,
100 మంది కండక్టర్ల అవసరం
జీతం డ్రైవర్లకు నెలకు రూ.22వేలు,
కండక్టర్లకు రూ.17,969