
ఆధునిక హంగులు.. అమృత్ వెలుగులు
సాక్షి, వరంగల్: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఆధునికీకరించిన వరంగల్ రైల్వే స్టేషన్ సకల సౌకర్యాలతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. రూ.25.41 కోట్ల అమృత్ నిధులతో కాకతీయుల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అభివృద్ధి చేసిన ఈ రైల్వేస్టేషన్‌ను గురువారం ఉదయం 9.30 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో ఉన్న వరంగల్ రైల్వే స్టేషన్‌లో కొత్త ప్లాట్‌ఫాంలు, ట్రాక్‌లు, సౌకర్యాల కల్పనతోపాటు అనేక విస్తరణలు, ఆధునికీకరణ పనులు చేశారు. ఈ స్టేషన్‌లో నాలుగు ప్లాట్‌ఫాంలు ఉన్నాయి.
ఏమేం పనులు
చేశారంటే..
కాకతీయ కళాతోరణం ఉండేలా స్టేషన్ ముఖద్వారాన్ని అభివృద్ధి చేశారు. ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారం, ప్రయాణికుల సౌకర్యార్థం 12 మీటర్ల వెడల్పు గల పాదచారుల వంతెన (ఫుట్‌ఓవర్ బ్రిడ్జి) నిర్మాణంతోపాటు మూడు లిఫ్ట్‌లు, నాలుగు ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. ప్లాట్‌ఫాం విస్తీర్ణం పెంపు, ప్లాట్‌ఫాంపై అదనపు కప్పు, దివ్యాంగులకు కొత్త టాయిలెట్ బ్లాకులు నిర్మించారు. వెయిటింగ్ హాల్ అభివృద్ధి, ఆహ్లాదం కోసం స్టేషన్ ఆవరణలో పచ్చదనాన్ని పెంచారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకుండా స్టేషన్ ప్రాంగణాన్ని మరింత అభివృద్ధి చేశారు. కళలు, సంస్కృతికి సంబంధించిన చిత్రాలు వేశారు. రైలు సూచిక బోర్డులు, కోచ్ సూచిక బోర్డులు అమర్చారు.
రోజుకు 31,887 మంది రాకపోకలు..
● కాజీపేట, విజయవాడ సెక్షన్‌లో ఉన్న ఈ స్టేషన్ రూ.41.09 కోట్ల వార్షిక ఆదాయం వస్తుంది. సగటున రోజుకు 31,887 మంది ప్రయాణికుల రాకపోకలతో కాజీపేట, హనుమకొండ, వరంగల్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులకు సేవలు అందిస్తోంది.
● ఈ స్టేషన్‌లో దాదాపు 137రైళ్లు ఆగుతాయి. న్యూ ఢిల్లీ, హౌరా, చైన్నె, విజయవాడ, విశాఖపట్నం, సికింద్రాబాద్, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లే సూపర్‌ఫాస్ట్ రైళ్లకు ఇక్కడా హాల్టింగ్ ఉంది.
వరంగల్ రైల్వే స్టేషన్‌కు నూతన సొబగులు
రూ.25.41 కోట్ల వ్యయంతో
అభివృద్ధి పనులు
ప్రయాణికులకు సకల సౌకర్యాలు
వర్చువల్‌గా నేడు
ప్రారంభించినున్న ప్రధాని మోదీ