
పంటల సాగులో జాగ్రత్తలు తీసుకోవాలి
నర్సంపేట: పంటల సాగులో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ వెంకట్‌రెడ్డి సూచించారు. చెన్నారావుపేట రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సాగు ఖర్చులు, రసాయన ఎరువుల వినియోగం ఎలా తగ్గించుకోవాలి, సాగునీరు ఆదా, పంట మార్పిడి ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ, విత్తన రకాలపై రైతులకు అవగాహన కల్పించారు. సూక్ష్మశాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ మానస సుస్థిర వ్యవసాయంలో జీవ ఎరువుల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం రైతులకు పలు సూచనలు, సలహాలు చేశారు. కార్యక్రమంలో నర్సంపేట ఏడీఏ దామోదర్‌రెడ్డి, చెన్నారావుపేట మండల వ్యవసాయ అధికారి గోపాల్‌రెడ్డి, వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
పంట మార్పిడితో అధిక దిగుబడి
దుగ్గొండి: పంట మార్పిడి పద్ధతితో అధిక దిగుబడి సాధించవచ్చని వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం పత్తి ప్రధాన శాస్త్రవేత్త వీరన్న అన్నారు. మండలంలోని లక్ష్మీపురం రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పంటలకు అధికంగా యూరియా వాడటం అనర్థమని, పచ్చిరొట్ట పైరుతో సేంద్రియ ఎరువు తయారు చేసుకోవాలని సూచించారు. పత్తి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కీటక శాస్త్రవేత్త శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనేటప్పుడు తప్పనిసరిగా బిల్లు అడిగి తీసుకోవాలని కోరారు. వరిసాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం ప్రతినిధి సారంగం, ఏఓ మాధవి, ఏఈఓ విజయ్‌నాయక్, రైతులు పాల్గొన్నారు.