
విత్తనాల కోసం క్యూలైన్లో చెప్పులు
కమలాపూర్: కమలాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద మంగళవారం జీలుగ విత్తనాల కోసం రైతులు ఎగబడ్డారు. ఆలస్యమైతే దొరుకుతాయో లేదోనని ఎండకు నిల్చోలేక తమ చెప్పులను క్యూలైన్లో ఉంచారు. మండలానికి ఇటీవల 500 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు వచ్చాయి. కమలాపూర్ పీఏసీఎస్‌లో 400 క్వింటాళ్లు, అంబాలలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో 100 క్వింటాళ్ల చొప్పున తరలించి మంగళవారం నుంచి రైతులకు పంపిణీ చేశారు. విత్తనాల్ని పంపిణీ చేస్తున్నారని తెలుసుకున్న రైతులు ఉదయం 7 గంటలకే పీఏసీఎస్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద బారులుదీరి ఎండ తీవ్రతను భరించలేక క్యూలైన్లో చెప్పులను ఉంచారు. విత్తన పంపిణీ సమయంలో రైతులు క్యూలైన్లో చెప్పులు ఉంచి ఎగబడడాన్ని గమనించిన అధికారులు క్యూలైన్లో రావాలని చెప్పడంతో మళ్లీ క్యూ కట్టారు. పోలీసు పహారాలో కమలాపూర్‌లో 250 క్వింటాళ్లు, అంబాలలో 100 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశారు. గతంలో సుమారు రూ.1,100 వరకు ఉన్నవి ప్రస్తుతం రూ.2,140కి పెరిగినా రైతులు మాత్రం పెద్ద ఎత్తున ఎగబడుతుండడం గమనార్హం.

విత్తనాల కోసం క్యూలైన్లో చెప్పులు