
రైతులకు అన్యాయం చేయొద్దు
ఖానాపురం: సొంత నిర్ణయాలతో మిల్లర్లు రైతులకు అన్యాయం చేయొద్దని జిల్లా సహకార శాఖ అధికారి నీరజ, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిష్టయ్య అన్నారు. మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, శ్రీనివాస రైస్‌మిల్లును శనివారం వారు తనిఖీ చేశారు. మిల్లు వద్దకు లారీలు ఎప్పుడు వచ్చాయి, దిగుమతి ఎలా చేస్తున్నారు, రైతులు, మిల్లర్ల మధ్య ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ ధాన్యం దిగుమతుల్లో ఆలస్యం చేసి, రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 93,070 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. 18,716 మంది రైతుల ఖాతాల్లో రూ.105 కోట్ల నిధులు జమచేసినట్లు పేర్కొన్నారు. సన్నవడ్ల బోనస్ ఇప్పటి వరకు పడలేదని, ప్రభుత్వానికి పంపుతున్నట్లు వివరించారు. మిల్లర్లు కోతలు విధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోలర్ రాజయ్య, సివిల్ సప్లయీస్ డీటీ సంధ్యారాణి, సొసైటీ సిబ్బంది మేరుగు రాజు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఏఓ శ్రీనివాస్ మిల్లును తనిఖీ చేసి సూచనలు చేశారు.
డీసీఓ నీరజ, సివిల్ సప్లయీస్ డీఎం
సంధ్యారాణి, జిల్లా అధికారి కిష్టయ్య
ఖానాపురంలో ధాన్యం కొనుగోలు
కేంద్రాలు, శ్రీనివాస రైస్‌మిల్లు తనిఖీ