
బోధన నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి
ఖిలా వరంగల్: శిక్షణ శిబిరాల ద్వారా ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాలను మరింతగా మెరుగుపర్చుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. వరంగల్ ఆర్టీఏ జంక్షన్ సమీపంలోని ఓ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ గురువారం రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారదతో కలిసి మంత్రి కొండా సురేఖ శిబిరాన్ని సందర్శించారు. శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులతో మాట్లాడా రు. విద్యాధానం ఎంతో గొప్పదని, ఉపాధ్యాయులకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఉపాధ్యాయుల మాటలు విద్యార్థులను ప్రభావితం చేస్తాయన్నారు. విద్యార్థులకు వారికి స్థాయికి అనుగుణంగా ఆసక్తిని పెంపొందించే విధంగా బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలతో విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలని తెలిపారు. కేవలం చదువుమాత్రమే కాకుండా విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ జ్ఞానేశ్వర్, సుజన్ తేజ, నాగేశ్వర్‌రావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల శిక్షణ శిబిరంలో
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ