పర్వతగిరి: పర్వతగిరి గ్రామపంచాయతీ పరిధిలో వృత్తి వ్యాపారం చేసుకొనే వారు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి కటకం కల్పన సూచించారు. ఈ మేరకు వృత్తి వ్యాపారం చేసే దుకాణాలను బుధవారం సందర్శించారు. అలాగే గ్రామంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. తాగునీటి సరఫరా, నర్సరీ మొక్కలు వర్మీకంపోస్టు తయారీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆమె వెంట డివిజన్ పంచాయతీ అధికారి వేదవతి, పంచాయతీ కార్యదర్శి రఘు, సిబ్బంది ఉన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నిట్ యాజమాన్యం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పీజీ కోర్సుల్లో ఎంటెక్, ఎమ్మెస్సీల్లో ప్రవేశానికి గాను జూన్ 4వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు ccmt2025helpdesk@nitw లేదా ccmn2025helpdesk@nitw లో సంప్రదించాలని పేర్కొన్నారు.
పోలీసుల అత్యుత్సాహం
హన్మకొండ : మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సుందరీమణుల రాకతో జిల్లా యంత్రాగం మహిళా ఉద్యోగులకు హరిత కాకతీయ హోటల్‌లో డ్యూటీలు వేశారు. రెవెన్యూ, పౌర సరఫరాల, జిల్లా పౌర సంబంధాల శాఖతో పాటు ఇతర విభాగాలకు చెందిన మహిళా ఉద్యోగులకు హరిత కాకతీయ హోటల్‌లో విధులు నిర్వహించేందుకు వచ్చారు. అయితే పోలీసులు మీరు ఇక్కడ ఉండొద్దని మహిళా ఉద్యోగులని కూడా చూడకుండా తిప్పి పంపారు. దీంతో తమకు తమ అధికారులు డ్యూటీలు వేస్తే పోలీసులు అవమాన పరిచేలా వ్యవహరించి వెళ్లగొట్టారని తెలిపారు.
ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన
ఐనవోలు: ఐలోని మల్లికార్జునస్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్మించిన ఆలయంలో ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని కోమల్లపల్లి సంపత్‌కుమార్ రుత్విక్ బృందం ఆధ్వర్యంలో బుధవారం వైభవంగా ప్రతిష్ఠించారు. మహా పూర్ణాహుతి, కుంభాభిషేకం, శాంతి కల్యాణం, ఒగ్గు పూజారులతో పెద్దపట్నం తదితర పూజలు నిర్వహించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, మాజీ ఎంపీపీ మధుమతి పాల్గొన్నారు. ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు నిర్మాణ దాతలు పర్ష సర్వేశ్వర్‌రావు యాదవ్ కుటుంబ సభ్యులకు శేషవస్త్రాలను అందజేశారు. అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు.
చింతామణి జలపాతం వద్ద సందడి
మంగపేట: మండల పరిధిలోని శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు బుధవారం స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. చింతామణి జలపాతం వద్ద నీటిని తాగి ఆహ్లాదంగా గడిపారు. కొబ్బరికాయలను కొట్టి పూజలు చేశారు. శిఖాంజనేయస్వామిని దర్శించుకున్నారు. దీంతో ఆలయం, షాపుల వద్ద భక్తులతో సందడి వాతావరణం నెలకొంది.
ఆర్టీసీ బస్సు టైర్ పగిలి ముగ్గురికి గాయాలు
పర్వతగిరి: ఆర్టీసీ బస్సు టైర్ పగలడంతో ముగ్గురు గాయపడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ నుంచి అన్నారం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో బుధవారం వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఉన్నారు. ఈక్రమంలో బస్సు పర్వతగిరి మండలంలోని తురుకల సోమారం వద్దకు రాగానే సాయంత్రం టైరు పగిలింది. దీంతో ఒక్కసారిగా బస్సు కుదుపునకు గురికావడంతో బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడ్డవారిలో హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన ఉల్లి మాధవి, గుంటూరుపల్లి గ్రామానికి చెందిన నూనావత్ బాలు, అన్నారం గ్రామానికి చెందిన రాజులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. టైరు పగలడంతో ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తమై మిగిలిన ప్రయాణికులకు ప్రమాదం జరుగకుండా జాగ్రత్త పడ్డాడు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

వృత్తి వ్యాపారస్తులు లైసెన్స్ తీసుకోవాలి