
గుర్తింపు కార్డుల కోసం రిజిస్ట్రేషన్ తప్పనిసరి
● కలెక్టర్ సత్యశారద
వర్ధన్నపేట: గుర్తింపు కార్డుల కోసం రైతులు దరఖాస్తులు అందచేసి తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. బుధవారం వర్ధన్నపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను సందర్శించి, దరఖాస్తులను పరిశీలించారు. రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. రెవెన్యూ సదస్సుల ద్వారా భూ భారతి చట్టంతో భూ సమస్యలు ఉన్న రైతుల దరఖాస్తులను పరిశీలించి అవసరమైనచోట భూముల వద్దకు అధికారులు వచ్చి సమస్యను అవగాహన చేసుకుని పరిష్కారం చూపనున్నట్లు తెలిపారు. బుధవారంతో రెవెన్యూ సదస్సులు ముగిసినట్లు తెలిపారు. ఎవరైనా రైతులు మిగిలిన వారు ఉంటే తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు అందచేయాలని సూచించారు. రైతులు తమ వివరాలను అందచేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే గుర్తింపు కార్డులు అందచేయనున్నట్లు తెలిపారు. గుర్తింపు కార్డుల వల్ల ప్రభుత్వం వద్ద అర్హులైన రైతులు ఎందరు ఉన్నారనే సమాచారం నిక్షిప్తమై ఉంటుందని అన్నారు. తద్వారా సబ్సిడీలు సులభంగా అందజేసే అవకాశం ఉంటుందన్నారు. అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్ విజయసాగర్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.