
మార్కెట్ భవనాన్ని వినియోగంలోకి తేవాలి
నర్సంపేట: కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన కూరగాయల మార్కెట్ భవనాన్ని తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పట్టణంలోని అంగడి ఆవరణలో ఉన్న కూరగాయల మార్కెట్ భవనం, పరిసర ప్రాంతాలను మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలోపు భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్యగౌడ్, ఏఈ, డీఈ, ఇంజనీర్లు, కూరగాయల వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.
కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలి
నర్సంపేట పట్టణంలోని కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నాలుగో వార్డులోని సర్వాపురం, ఇందిరమ్మ కాలనీల్లో మంగళవారం ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. రోడ్ల నిర్మాణం చేయిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఏఈ రాజేశ్‌కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్యగౌడ్, మాజీ ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కాలనీ ప్రజలు పాల్గొన్నారు.