
సుందరీమణుల రాకకు విస్తృత ఏర్పాట్లు
హన్మకొండ కల్చరల్ / ఖిలా వరంగల్ : నగరంలోని వేయిస్తంభాల ఆలయంతో పాటు ఖిలా వరంగల్ కోట శిల్పాల ప్రాంగణాన్ని ప్రపంచ సుందరీమణులు సందర్శిస్తున్న సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య వివిధ శాఖల అధికారులకు సూచించారు. రేపు (బుధవారం) ప్రపంచ సుందరీమణుల రాక సందర్భంగా సోమవారం హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, పోలీస్ కమిషనర్ సన్‌ప్రిత్‌సింగ్, డీసీపీ సలీమా, ఆర్డీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్, ‘కుడా’, దేవాదాయశాఖ, టూరిజం, పోలీస్ అధికారులు వేయిస్తంభాల దేవాలయాన్ని, కోటను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. 14వ తేదీన సాయంత్రం 4ః30 గంటలకు హరితకాకతీయ హోటల్ నుంచి వేయిస్తంభాల గుడికి వస్తారని, దేవాలయం చుట్టూ,కల్యాణ మండపంలో గ్రీన్‌మ్యాట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం గర్భాలయంలో పూజలు చేస్తారని స్వామివారి దర్శనం, పూజ కార్యక్రమం నిర్వహించడానికి నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఆలయ నాట్యమండపంలో తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందించాలని ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మకు సూచించారు. అనంతరం ఆలయ విశిష్టతను, ప్రాశస్త్యాన్ని వివరించాలని అన్నారు. త్రికూటాలయం చుట్టూ శిల్పకళను, నందీశ్వరుడి సన్నిధిలో, కల్యాణమండపంలో 55 నిమిషాల పాటు ఫొటోషూట్ ఉంటుందని వివరించారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని కేంద్రపురావస్తు శాఖ కోఆర్డినేటర్ నిరంజన్, ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌కు ఆమె సూచించారు. దేవాలయం ఎదుట పచ్చదనంతో శుభ్రంగా కనిపించాలని, ‘కుడా’ గార్డెన్‌లో జరుగుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాత్రి వేళల్లో కోట మరింత సౌందర్యవంతగా కనిపించేలా తీర్చిదిద్దిన లైటింగ్ ఏర్పాట్లను పర్యాటక శాఖ ట్రయిల్ రన్ వేయగా ఆసక్తిగా తిలకించారు. సుందరీమణుల రాకతో ఓరుగల్లు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, హనుమకొండ జిల్లా అధికారి వై.వి గణేష్, టూరిజం శాఖ అధికారులు నాథన్, శివాజీ, సూర్యకిరణ్, ఏసీపీలు దేవేందర్‌రెడ్డి, నందిరామ్‌నాయక్, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, హనుమకొండ సీఐ సతీష్‌కుమార్, నోడల్ అధికారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వేయిస్తంభాల ఆలయం, కోటలో శిల్పాల ప్రాంగణాన్ని పరిశీలించిన
కలెక్టర్లు, అధికారులు