
గైర్హాజరుకు చెక్..!
నర్సంపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందడం లేదు. సౌకర్యాలు మెరుగుపడినప్పటికీ కొంతమంది వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది విధులకు సరిగా హాజరుకాకపోవడంతో పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలో అప్పులు చేసి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది గమనించిన ప్రభుత్వం గతంలో ఉన్న బయోమెట్రిక్ హాజరు విధానానికి స్వస్తి పలికి.. ఫేస్ అటెండెన్స్ విధానం అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ప్రత్యేక నిఘా..
జిల్లాతోపాటు డివిజన్, మండల కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించింది. అయితే సిబ్బంది, అధికారులు పట్టణాల్లో ఉంటూ రాకపోకలు సాగిస్తూ వైద్య సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో బస్సులు, రైళ్లు సమయానికి రాకపోవడంతో ఉద్యోగులు, సిబ్బంది ఆలస్యంగా రావడం లేదా మొత్తానికే ఆరోజు రాకపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా కరువైందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఫేస్ అటెండెన్స్ ద్వారా ప్రత్యేక నిఘాతోపాటు రోగులకు జవాబుదారీగా ఉంటుంది. అలాగే, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా ఉంటుంది.
రోగుల అవస్థలు..
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగుపడినప్పటికీ.. మరికొన్ని సేవలు అందుబాటలో లేకపోవడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. దీనికి తోడు వైద్యులు, సిబ్బంది గైర్హాజరుతో నిరీక్షించి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. అక్కడ వేల రూపాయలు చెల్లించి వైద్య సేవలు పొందుతున్నారు. దీంతో పేదవారిపై ఆర్థిక భారం పడుతుంది. ఫేస్ అటెండెన్స్ విధానంతో పేదల కష్టాలు తీరే అవకాశం ఉంది.
అటెండెన్స్ విధాన ం ఇలా.
ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది విధులకు హాజరుకాకున్నా క్షేత్ర పర్యటన, సమావేశాలకు హాజరవుతున్నట్లు చెబుతూ గైర్హాజరవుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఈ మేరకు తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో నూతన విధానం ద్వారా ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసేందుకు అబ్బాస్ విధానం అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. నూతనంగా ప్రతిపాదించిన యాప్‌ను మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని.. నిత్యం ఆ యాప్ ద్వారా ఫేస్ అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. యాప్‌లో సంబంధిత ఉద్యోగి ఆధార్ నంబర్ అనుసంధానం చేయడం ద్వారా ముఖ గుర్తింపు ఉంటుంది. దీంతో వారు పని చేసే లొకేషన్‌లోనే హాజరు వేశారా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు. తద్వారా గైర్హాజరు కట్టడితోపాటు రోగులకు మెరుగైన సేవలు అందుతాయని అధికారులు తెలిపారు.
రోగులకు మెరుగైన సేవలు..
ఇప్పటి వరకు ఉన్న వేలిముద్ర హాజరుతో ఆస్పత్రుల్లో సిబ్బంది సమయపాలన, నిబంధన ఉంది. రానున్న ఫేస్ స్కానింగ్ హాజరుతో మరింత సులభంగా ఉంటుంది. దీని ఫలితంగా ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందుతాయి. ఇందులో భాగంగానే ఉద్యోగుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ కమిషనర్ కార్యాలయానికి అందించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చి వెంటనే కొత్త విధానం అమలవుతుంది.
– ప్రకాశ్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ
●
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇక ఫేస్ అటెండెన్స్
ఇప్పటివరకు ఉన్న బయోమెట్రిక్ విధానానికి స్వస్తి
వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో నిర్ణయం
జిల్లాలో ఆస్పత్రుల వివరాలు..
నర్సంపేటలోని జిల్లా ఆస్పత్రి : 1
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు : 14
పట్టణ ఆరోగ్య కేంద్రాలు : 7
బస్తీ దవాఖానలు : 2

గైర్హాజరుకు చెక్..!