న్యూశాయంపేట: ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి భూములు అందించిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి భూములు అందించిన రైతులకు పరిహారం చెల్లింపు, పురోగతి, దామెర చెరువు సుందరీకరణ, పైడిపల్లిలో స్పోర్ట్‌సిటీ ఏర్పాటు, నర్సంపేట ప్రభుత్వాస్పత్రిలో డయాలసిస్ సెంటర్ అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ‘కుడా’ పీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, జిల్లా ఇరిగేషన్ అధికారి శంకర్ ఆస్పత్రి పర్యవేక్షకులు మోహన్‌దాస్ తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాంల పరిశీలన
వరంగల్: ఏనుమాముల వ్యవసాయమార్కెట్ యార్డులో భద్రపర్చిన ఈవీఎంల గోదాంలను కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి శనివారం పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోదాములను కలెక్టర్ తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూం రికార్డులు, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇక్బాల్, నాయబ్ తహసీల్దార్ రంజిత్ పాల్గొన్నారు.
నర్సంపేట ఏసీపీగా రవీందర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ
నర్సంపేట: నర్సంపేట ఏసీపీగా పున్నం రవీందర్‌రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఏసీపీగా పనిచేసిన కిరణ్‌కుమార్ డీజీపీ కార్యాలయానికి బదిలీ కాగా.. ఖమ్మం సీసీఆర్‌బీలో ఏసీపీగా పనిచేస్తున్న పున్నం రవీందర్‌రెడ్డికి నర్సంపేట పోస్టింగ్ ఇచ్చారు. బాధ్యతలు స్వీకరించిన ఏసీపీకి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజావాణి రద్దు
న్యూశాయంపేట: కలెక్టరేట్‌లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ సత్యశారద శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిపాలనాపరమైన కారణాల వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు, ఈవిషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని ఆమె కోరారు.
పిడుగుపాటుకు దుక్కిటెద్దు మృతి
రాయపర్తి: పిడుగుపాటుకు దుక్కిటెద్దు మృతిచెందిన సంఘటన మహబూబ్‌నగర్ గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎలుకపల్లి యాకయ్య కొట్టం పక్కనే దుక్కిటెద్దును కట్టేశాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం వర్షంతో కూడిన పిడుగు పడి రూ.65 వేల విలువైన దుక్కిటెద్దు మృతి చెందింది.
నర్సంపేట ఆర్టీసీ డిపో ఉద్యోగులకు అవార్డులు
నర్సంపేట: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వరంగల్ రీజియన్ మేనేజర్ విజయభాను ఆధ్వర్యంలో నాలుగో త్రైమాసిక ప్రగతి చక్రం అవార్డుల ప్రదానోత్సవాన్ని శనివారం తొర్రూరు డిపోలో నిర్వహించారు. నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన ఉద్యోగులు హరిసింగ్, ఎన్‌ఎన్.రావు, ఎస్‌ఎస్.పాణి, పీవీ రావు, మహేశ్ అవార్డులు అందుకున్నారు. ఇంధన పొదుపు, డిపో ఆదాయం పెంచినందుకు జ్ఞాపికలు, క్యాష్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మి అవార్డులు అందుకున్న ఉద్యోగులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మిగతా ఉద్యోగులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వరంగల్ డిప్యూటీ ఆర్‌ఎం భానుకిరణ్, మహేశ్‌కుమార్, నర్సంపేట డిపో అసిస్టెంట్ మేనేజర్ సంతోష్, ఎంఎఫ్ ప్రభాకర్, సేఫ్టీ వార్డెన్‌బాబు, ఉద్యోగులు పాల్గొన్నారు.