
బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యం ఖరారు
గీసుకొండ: స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం బ్యాంకు లింకేజీ రుణాలను అందిస్తోంది. 2025–2026ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 8484 సెర్ప్ స్వయం సహాయక మహిళా సంఘాల(ఎస్‌హెచ్‌జీ)కు రూ. 519,75,42,000 రుణ సహాయం అందించాలని కార్యాచరణ రూపొందించారు. 2024–2025లో జిల్లాలో 6,540 సంఘాలకు రూ.513.45 కోట్ల రుణాలను అందించాల్సి ఉండగా.. లక్ష్యానికి మించి రూ.545.91 కోట్లను (106.32 శాతం) పంపిణీ చేశారు. నాలుగేళ్ల నుంచి బ్యాంకు లింకేజీ రుణాల ను జిల్లాలో లక్ష్యానికి మించి పంపిణీ చేస్తుండడం విశేషం. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ. 328.18 కోట్లు లక్ష్యం కాగా.. రూ.381.39 కోట్లు పంపిణీ చేశారు. అలాగే, 2022–2023 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి పంపిణీ చేయగా.. 2023–2024లో రూ.426.7 కోట్ల లక్ష్యం కాగా.. రూ.452.84 కోట్లు పంపిణీ చేశారు.
ఆర్థిక ఎదుగుదలకు ఊతం..!
స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఆర్థికంగా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు లింకేజీ రుణాలు దోహదపడతాయి. సంఘాల్లో రుణం అవసరమున్న మహిళలను గురించి పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు, మండల సమాఖ్య నిర్వాహకులు, ఏఓల వారీగా రుణప్రణాళిక తయారు చేస్తారు. ఎస్‌హెచ్‌జీల్లోని సభ్యులకు కుట్టుమిషన్లు, పిండిగిర్ని, కిరాణం, బట్టలషాపు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం, వ్యవసాయ పనిముట్లు, పెట్టుబడి సాయం, శానిటరీ న్యాప్కిన్ల తయారీ.. ఇలా అనేక రకాల వ్యవసాయ, వ్యవసాయేత రంగాలకు సంబంధించిన రుణాలు ఇస్తారు. ఒక్కో సంఘానికి రూ.10 లక్షల నుంచి 20 లక్షల వరకు రుణాలు అందిస్తూ వారి జీవనోపాధికి బాటలు వేస్తున్నారు.
మండలాల వారీగా రుణ లక్ష్యం
(రూపాయల్లో) ఇలా..
జిల్లాలో 8,484 ఎస్‌హెచ్‌జీలు
రూ.519.75 కోట్ల పంపిణీ లక్ష్యం
మండలం ఎస్‌హెచ్‌జీలు రుణ లక్ష్యం
చెన్నారావుపేట 64 42,00,30,000
దుగ్గొండి 993 33,99,98,000
ఖానాపురం 677 41,84,41,000
నల్లబెల్లి 692 40,86,63,000
నర్సంపేట 736 47,94,47,000
నెక్కొండ 1,001 62,99,11,000
పర్వతగిరి 814 49,83,89,000
రాయపర్తి 1,005 61,36,53,000
సంగెం 847 55,98,93,000
వర్ధన్నపేట 664 40,70,20,000