
‘దంతం’.. అందని వైద్యం
ఎంజీఎం : ఎంజీఎం ఆస్పత్రికి వస్తే మెరుగైన వైద్యం అందుతుందనే నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతోంది. ఇన్‌చార్జ్‌ల పాలన రోగులకు శాపంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలకు దంత వైద్యం కోసం ప్రభుత్వ పరంగా ఎంజీఎం ఆస్పత్రి పెద్ద దిక్కు. రోజూ వందలాది మంది దంత సమస్యలతో చికిత్స నిమిత్తం వస్తూ ఉంటారు. ఇంత పెద్ద డెంటల్ వైద్య విభాగాన్ని నిత్యం పర్యవేక్షించాల్సిన హెచ్‌ఓడీని డిప్యూటేషన్‌పై హెల్త్ యూనివర్సిటీకి పంపించడంతో విభాగం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సదరు హెచ్‌ఓడీ డిప్యూటేషన్ ఏళ్ల తరబడి కొనసాగుతుండడంతో సమస్యలు పరిష్కారం కావడంలేదు. ప్రస్తుతం దంత వైద్య విభాగం మూలన పడే పరిస్థితి నెలకొంది. రోజూ ఆస్పత్రికి వంద మందికిగా పైగా డెంటల్ సమస్యలతో వచ్చే రోగులకు ఒకే అసిస్టెంట్ ప్రొఫెసర్ వైద్యం అందించాల్సిన పరిస్థి తి నెలకొంది. పళ్లు తొలగించడం, చికిత్స చేయడం తదితర వైద్యసేవలు భారంగా మారాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగుల గంట తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైనా సందర్భంలో ఆ డాక్టర్ సెలవుపై వెళ్తే దంత వైద్య విభాగం సేవలు నిలిచిపోయినట్టే.
నోటిఫికేషన్‌తో సరి..
ఎంజీఎం ఆస్పత్రి దంత వైద్యవిభాగంలో వైద్యుల కొరత తీర్చడానికి కలెక్టర్ ఆదేశాలతో పరిపాలనాధికారులు రెండు పోస్టులకు ఈ ఏడాది మార్చి 21వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేశారు. 22 నుంచి 24వ తేదీ వరకు ఆసక్తి ఉన్న దంత వైద్య అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. వారం రోజుల్లోగా మెరిట్ జాబితా తయారు చేసిన అధికారులు ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తి చేసి 30 రోజులు గడస్తున్నా నియామకం చేపట్టడం లేదు. అభ్యర్థుల ఎంపిక విషయంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సులతో అధికారులు ముందుకు సాగుతూ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎంజీఎం ఆస్పత్రిలోని డెంటల్ విభాగాన్ని డాక్టర్ల కొరత వెంటాడుతోంది. ఇంత పెద్ద ఆస్పత్రికి ఉన్నది ఇద్దరు వైద్యులు. అందులో ఒకరు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఉన్నది ఒకే డాక్టర్. కాంట్రాక్టు పద్ధతిన దంత వైద్యుల నియామకానికి మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేసినా నేటికీ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఏదైనా కారణం చేత ఆ ఒక్క డాక్టర్ రాకుంటే ఇక ఆ విభాగానికి సెలవే. దీంతో పంటి సమస్యలతో వచ్చిన రోగులు చుక్కలు చూడాల్సిందే.
ఎంజీఎంకు డెంటల్ డాక్టర్ల కొరత
నోటిఫికేషన్ ఇచ్చారు..
నియామకం మరిచారు
ఇద్దరు వైద్యుల్లో ఒకరు డిప్యూటేషన్‌లో..
రోగులకు ఒకే అసిస్టెంట్ ప్రొఫెసర్ దిక్కు
ఆస్పత్రికి వచ్చే రోగులకు తప్పని పాట్లు

‘దంతం’.. అందని వైద్యం