
ఈదురు గాలులతో ఎన్పీడీసీఎల్‌కు నష్టం
హన్మకొండ: ఈదురు గాలులకు టీజీ ఎన్పీడీసీఎల్‌కు భారీ నష్టం వాటిల్లింది. ఈనెల 5న రాత్రి వీచిన ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి. విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు పాడయ్యాయి. దీంతో హనుమకొండ జిల్లాలో రూ.25 లక్షలు, వరంగల్ జిల్లాలో 22.79 లక్షల నష్టం జరిగింది. హనుమకొండ జిల్లాలో 97 స్తంభాలు విరిగిపోయాయి. మూడు ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వరంగల్ జిల్లాలో 293 స్తంభాలు విరిగిపోయాయి. విద్యుత్ లైన్లు 4.28 కిలో మీటర్లు దెబ్బతింది. ఆరు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ సమస్య తలెత్తిన సమయం నుంచి పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో ఉండి పునరుద్ధరణ పనులు పూర్తి చేశారన్నారు. మరమ్మతు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ సరఫరా అందించినట్లు హనుమకొండ ఎస్‌ఈ పి.మధుసూదన్‌రావు, వరంగల్ ఎస్‌ఈ కె.గౌతం రెడ్డి తెలిపారు. విద్యుత్ సామగ్రి సరిపడా అందుబాటులో ఉందని, విద్యుత్ సిబ్బంది 24/7 క్షేత్రస్థాయిలో ఉంటున్నారన్నారు. అధికారులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ విద్యుత్ సరఫరాను మానిటర్ చేస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడిన వెంటనే పున్నరుద్ధరించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, అర్ధరాత్రి సైతం లెక్కచేయకుండా క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నారని అభినందించారు. వినియోగదారులు విద్యుత్‌పై జాగ్రత్త వహించాలని, విద్యుత్ స్తంభాలు, ఇంట్లోని స్విచ్ బోర్డులను తడి చేతులతో ముట్టుకోవద్దన్నారు. స్వీయ నియంత్రణ ముఖ్యమని ఎట్టి పరిస్థితుల్లో స్వయంగా విద్యుత్ మరమ్మతులు చేప్పట్టవద్దని కోరారు. విద్యుత్ అంతరాయం, ఇతర సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్ 1912, 180042 50028కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.
హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో రూ.47.79 లక్షలు నష్టం