
గైర్హాజరైనవారికి మెమోలివ్వండి..
● వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రిలో
15మందికి ముగ్గురు డాక్టర్లే హాజరు
● ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ సత్యశారద
వర్ధన్నపేట: ఆస్పత్రికి రాకుండా డుమ్మాకొట్టిన డాక్టర్లకు మెమోలు జారీ చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలనలో భాగంగా మంగళవారం వర్ధన్నపేటకు వచ్చిన కలెక్టర్ సత్యశారద పట్టణంలోని ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు. విధుల్లో ఉండాల్సిన 15 మందిలో కేవలం ముగ్గురు వైద్యులు మాత్రమే ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బయోమెట్రిక్‌పై ఆస్పత్రి సూపరింటెండెంట్ నరసింహస్వామిని ప్రశ్నించా రు. తనిఖీ సమయంలో వైద్యుల గైర్హాజరుపై మాట్లాడుతూ.. డాక్టర్లకు ట్రీట్‌మెంట్ చేయాల్సి ఉందని కలెక్టర్ చమత్కరించారు. ఇదిలా ఉండగా.. వర్ధన్నపేట మండలాన్ని భూభారతి చట్టంతో పైల ట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంతో మండలంలోని ఉప్పరపల్లి, దివిటిపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను పరిశీలించారు. కట్య్రాల, వర్ధన్నపేట జెడ్పీఎస్‌ఎస్ పాఠశాలల్లో వేసవి శిక్షణ శిబిరాలను సందర్శించారు. దమ్మన్నపేట, ఉప్పరపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిశీలించారు. రామవరంలో మంచినీటి సరఫరాపై అధికారులకు సూచనలు చేశారు. వర్ధన్నపేట, దమ్మన్నపేట, ఉప్పరపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను కలిశారు. ఆమె వెంట జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డబ్ల్యూఎస్‌డీఈఈ శ్రీనివాస్, తహసీల్దార్ విజయసాగర్ ఉన్నారు.