
ప్రణాళికతో ధాన్యం కొనాలి
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి
ఉత్తమ్ కుమార్ రెడ్డి
హన్మకొండ: ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి సన్న బియ్యం సరఫరా, ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ కమిషనర్‌తో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు, సన్నబియ్యం పంపిణీ, తాగునీటి సమస్యలపై చర్చించారు. సమావేశంలో జిల్లా నుంచి కలెక్టర్ పి.ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కొమరయ్య, సివిల్ సప్లయీస్ డీఎం మహేందర్, డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్‌సింగ్, ఇరిగేషన్ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వరంగల్ జిల్లానుంచి అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి శంకర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ, జిల్లా పౌర సరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ తదితరులు పాల్గొన్నారు.
కేయూ డిగ్రీ సెమిస్టర్ల
పరీక్షలు వాయిదా..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీ ఒకేషనల్, బీసీఏ తదితర కోర్సుల 2,4,6 సెమిస్టర్ల పరీక్షలు, మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ల పరీక్షలు (బ్యాక్‌లాగ్) ఈనెల 21 నుంచి జరగాల్సి ఉండగా.. వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శనివారం తెలిపారు. ఎక్కువ శాతం ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు విద్యార్థుల పరీక్షల ఫీజులు యూనివర్సిటీకి చెల్లించలేదు. అదేవిధంగా నామినల్ రోల్స్‌ను కూడా పంపలేదు. దీంతో ఆయా పరీక్షలను వాయిదా వేశామని రాజేందర్ తెలిపారు. ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహింస్తారనేది త్వరలో తెలియజేస్తామని, నిర్వహణ రీషెడ్యూల్‌ను కూడా విడుదల చేస్తామని వెల్లడించారు.
బస్సు అదుపు తప్పి
ఆరుగురికి గాయాలు
హసన్‌పర్తి: ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఆరుగురికి గాయాలయ్యాయి. వరంగల్–2 డిపోనకు చెందిన ఎలక్ట్రికల్ బస్సు శుక్రవారం రాత్రి వేములవాడ నుంచి వరంగల్‌కు బయల్దేరింది. మార్గమధ్యలోని అన్నాసాగరం సమీపంలోకి రాగానే అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. సమీపంలోనే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. ఆప్రాంతంలో ఘటన జరిగితే ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
పార్లమెంట్ దృష్టికి
న్యాయవాదుల సమస్యలు
వరంగల్ ఎంపీ కడియం కావ్య
హన్మకొండ: న్యాయవాదుల సమస్యలు పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తానని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. శనివారం హనుమకొండలోని జెడ్పీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కావ్య మాట్లాడుతూ.. న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు, జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈసందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ బార్ అసోసియేయన్ల ఎన్నికల్లో గెలిచిన న్యాయవాదులను ఎంపీ కావ్య సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు బైరపాక జయాకర్, మాదిగ లాయర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు వీరదాసు వెంకటరత్నం, ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి లావుడే సిద్ధునాయక్, హనుమకొండ బార్ అసోసియేషన్ కార్యదర్శి రవి, మాజీ అధ్యక్షుడు మాతంగి రమేశ్‌బాబు, న్యాయవాదులు కొండపాకల కృష్ణ, నాగభూషణం, బండి మొగిలి, భాగ్యమ్మ, ముఖేశ్ రమేశ్‌నాయక్ పాల్గొన్నారు.

ప్రణాళికతో ధాన్యం కొనాలి