చట్టం ఏం చెబుతోందంటే..!
స్థానిక సంస్థల ఆదాయ, వ్యయాన్ని అదుపు చేసేందుకు రూపొందించిన శాసన బద్ధమైన ప్రక్రియే లెక్కపద్దులు(బడ్జెట్). ఏటా ఆదాయ వనరులు, వ్యయం అంచనా రూపొందించే ఈ ప్రక్రియ పురపాలక సంఘాలకు ఆయువుపట్టు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పురపాలక సంస్థలు అంచనాలను డిసెంబర్ చివరి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. అయితే బల్దియా అధికార యంత్రాంగం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది.
వరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాల రూపకల్పనలో తీవ్రజాప్యం జరుగుతోంది. ఇప్పటికే ఆదాయ వ్యయాల అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాల్సిన అధికా ర, పాలక యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది.
మరో పక్షం రోజులే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ 2025–26 కేటాయింపులు, వ్యయం వంటి వివిధ అంశాలకు సంబంధించిన ప్రక్రియకు మరో పక్షం రోజుల్లోగా ముగింపు పలకాల్సి ఉంది. ఈలోగా ఆర్థిక సంవత్సరానికి అవసరమైన ఆదాయ, వ్యయాల బడ్జెట్ అంచనాల రూపకల్పన పూర్తి చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి అన్ని విభాగాల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించి ముందస్తు అంచనాలు సిద్ధం చేసి ఇవ్వాలి. మార్చి నెల సగం గడిచినా అధికారులు ముందస్తు అంచనాలను అందించలేకపోయారు.
నోటీసులు జారీ చేసినా..
గ్రేటర్‌లోని వివిధ విభాగాలకు డిసెంబర్ మొదటి వారంలో నోటీసులు జారీ చేశారు. పక్షం రోజుల్లో అంచనాలు తయారు చేసి అందించాలని కోరారు. జనవరిలో మారో నోటీసు ఇచ్చారు. అయినప్పటికీ ఆయా విభాగాల అధికారులు అంచనాల రూపకల్పన, వివరాలు ఇవ్వలేదు. అవసరమైన వివరాలను అధికారులకు అందచేయడంలో ఎప్పుడూ వీరిదే వెనుకడుగు. మార్చితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం లోపు నూతన బడ్జెట్ అంచనా, వ్యయాల వివరాలు వీరు ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు గ్రేటర్‌లో అమలవుతున్న కీలక పథకాలకు వెచ్చించిన వ్యయాలు, భవిష్యత్‌లో రావాల్సిన నిధులు.. ప్రభుత్వ నిధులు.. అందుకు అనువుగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రాతిపాదికన అంచనాలను పూర్తి స్థాయిలో క్రోడీకరించి పంపాల్సి ఉంటుంది. ఫలితంగా మార్చిలోగా చేపట్టే.. మిగిలిపోయే.. కొనసాగించాల్సిన పనులకు సంబంధించి ఆర్థిక కేటాయింపులకు పాలక పక్షానికి తగిన అవకాశం ఉంటుంది. ఈ విషయాల్లో అటు పాలకులు, ఇటు అధికారులకు కనీస అవగాహన లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
గాడి తప్పిన గ్రేటర్ పాలన
గడువు దాటినా సిద్ధం చేయని
2025–26 బడ్జెట్ అంచనాలు
విభాగాల మధ్య కొరవడిన సమన్వయం
అధికారులకు నోటీసులు
జారీ చేసినా స్పందించని పరిస్థితి