
గిరిజన వర్సిటీకి మంచిరోజులు వచ్చేనా?
● ప్రస్తుతం రెండు కోర్సులే...
అడ్మిషన్ తీసుకున్నది 14 మంది
● యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో
తరగతుల నిర్వహణ
● ఎట్టకేలకు తొలి వైస్ చాన్స్‌లర్
నియామకం...
● ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్‌కు
వీసీగా బాధ్యతలు..
సాక్షిప్రతినిధి, వరంగల్: సమ్మక్క–సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ (ఎస్‌ఎస్‌సీటీయూ)కి మంచిరోజులు వచ్చినట్లేనా? యూనివర్సిటీని ప్రారంభించిన సుమారు ఏడాదిలో తొలి వైస్ చాన్స్‌లర్‌ను నియమించడం ద్వారా ప్రభుత్వాలు దృష్టి సారించినట్లేనా? అంటే అవుననే అంటున్నారు అధికారులు. 2023 అక్టోబర్‌లో ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది. 500 ఎకరాల స్థలం కేటా యింపు.. రూ.900 కోట్లను ప్రకటించినా.. ఆ మేరకు హెచ్‌ఓడీలు, అధ్యాపకులు, మౌలిక వసతులు లేక విద్యార్థులు అడ్మిషన్ తీసుకోలేదు. తరగతులు 2024–25 సంవత్సరం నుంచే ప్రారంభించినా స్పాట్ అడ్మిషన్ల తర్వాత కేవలం 14 మంది చేరగా.. జాకారం వైటీసీలో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్నారు.
ఒక్కో కోర్సులో 20 మంది...
2018 జనవరి 4వ తేదీన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)తో కూడిన ప్రణాళికతో పాటు ఉన్న స్థలంలోనే తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖకి, హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీ (హెచ్‌సీయూ)కు నివేదికను అప్పగించింది. సంప్రదించిన హెచ్‌సీయూ 2019వ సంవత్సరం 19వ తేదీన రాష్ట్ర ఉన్నత విద్యామండలిని కోరింది. ఇందుకు ములుగు మండలంలోని అడ్మినిస్ట్రేషన్ నిర్వహణ కోసం యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ)లో 10 రకాల కోర్సులతో ఒక్కో కోర్సులో 20 మందితో తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు.
వీసీ నియామకంతో కదలిక..
ట్రైబల్ యూనివర్సిటీ (ఎస్‌ఎస్‌సీటీయూ) తొలి వీసీ నియామకం జరగడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తొలి వీసీగా ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ తరఫున డిప్యూటీ సెక్రటరీ శ్రేయ భరద్వాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వైఎల్ శ్రీనివాస్ అరోరా వర్సిటీ వీసీగా పని చేస్తుండగా.. ఆయన నియామకంతో ట్రైబల్ యూనివర్సిటీ పురోగతికి ముందడుగు పడినట్లేనన్న చర్చ జరుగుతోంది.