
వరంగల్ క్రైం : మిలాద్–ఉన్–నబీ పండుగ ర్యాలీని ఈనెల 28కి వాయిదా వేసినట్లు ట్రైసిటీ ముస్లిం పెద్దలు నిర్ణయించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్‌బారి ఆధ్వర్యంలో గురువారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ట్రైసిటీ ముస్లిం పెద్దలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈనెల 27న వినాయక నిమజ్జనంతోపాటు మిలాద్–ఉన్–నబీ పండుగలు ఉన్నాయి. మతసామరస్యాన్ని కాపాడేందుకు ఈనెల 28న ర్యాలీ నిర్వహించేందుకు మత పెద్దలు నిర్ణయించినట్లు డీసీపీ బారి తెలిపారు. ర్యాలీని వాయిదా వేసుకున్నందుకు సీపీ ఏవీ రంగనాథ్ ముస్లిం మత పెద్దలను అభినందించినట్లు తెలిపారు. సమావేశంలో కాజీపేట దర్గా పీఠాధిపతి సయ్యద్‌గులాంఅఫ్జల్ బియాబానీ (ఖుస్రూపాషా), మండిబజార్‌కు చెందిన జార్ఫుల్లా అబిదీన్, మట్టెవాడ, సుబేదారి ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, షుకుర్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌సీడీపై శిక్షణ
ఎంజీఎం : జాతీయ అసంక్రమిత వ్యాధుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో వైద్యాధికారులు, స్టాఫ్‌నర్సులకు గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి కార్డియో వస్కులర్, హెల్త్ ఆఫీసర్లు శ్రావణ్‌రెడ్డి, సత్యేంద్రనాథ్, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి ఉమాశ్రీ మాట్లాడుతూ మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, తగిన శారీరక శ్రమలేకపోవడంతో డయాబెటిస్, రక్తపోటు, క్యాన్సర్ వ్యాధులు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. క్యాన్సర్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ, చికిత్సతోపాటు తదనంతర సేవలను సరైన విధంగా అందించాలన్నారు. అదనపు డీఎంహెచ్‌ఓ మదన్‌మోహన్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ యాకూబ్‌పాషా, డెమో అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
హెచ్‌ఎంల పదోన్నతికి
వెబ్ ఆప్షన్స్
విద్యారణ్యపురి : మల్టీజోన్–1 పరిధిలోని 19 జిల్లాల్లో స్కూల్‌అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా పదోన్నతి కల్పించేందుకు గురువారం నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. ఎడిట్ ఆప్షన్ కు ఈనెల 23న అవకాశం కల్పించారు. పదోన్న తి వద్దనుకునే వారికి నాట్ విల్లింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్‌లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. 19 జిల్లాల్లో మొత్తం 1,093 హెచ్‌ఎంల పోస్టులు ఖాళీలుగా ఉన్నా యి. స్కూల్‌అసిస్టెంట్లకు సంబంధించిన సీని యారిటీ జాబితాలు పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి ఇప్పటికే వెల్లడించారు. ఆయా స్కూల్‌అసిస్టెంట్ల నుంచి అభ్యంతరాలను కూడా స్వీకరించారు. స్కూల్‌అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించి 1,093 హెచ్‌ఎం పోస్టులను భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఎన్నికల షెడ్యూల్ విడుదల
వరంగల్ లీగల్ : ఉమ్మడి జిల్లా న్యాయవాదుల పరస్పర సహాయక సహకార సంఘంలోని నాలుగు డైరెక్టర్ల స్థానాల ఎన్నికల కోసం సొసైటీ కార్యదర్శి వి.రాజ్‌కర్ణాకర్ గురువారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నెల 25న సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల దాఖలు, 25న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, సాయంత్రం 4 గంటలకు పోటీలో ఉండే అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తామని కార్యదర్శి తెలిపారు. 29న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, అదేరోజు ఓట్ల లెక్కింపు నిర్వహించి విజేతలను ప్రకటిస్తామని పేర్కొన్నారు.
రుద్రేశ్వరాలయంలో
డుండి గణపతికి పూజలు
హన్మకొండ కల్చరల్ : రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో గురువారం మూల మహాగణపతిని డుండి గణపతిగా అలంకరించి పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి రుద్రేశ్వరస్వామివారికి రుద్రాభిషేకం, పూజలు నిర్వహించారు. గణపతి నవగ్రహ రుద్రహోమం, అన్నప్రసాదాల వితరణ చేశారు. సాయంత్రం ప్రదోషకాల పూజలు జరిపారు. సీహెచ్.కృష్ణవేణి శాసీ్త్రయ సంగీతం అలరించింది.
