వనపర్తి: బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అదనపు ఎస్పీ (అడ్మిన్) రాజేష్ మీనా కోరారు. మంగళవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ముస్లిం మతపెద్దలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సామరస్యంగా నిర్వహించుకునేలా ప్రజల్లో సమన్వయం ఏర్పడేలా చూడాలన్నారు. పశువుల అక్రమ రవాణా కట్టడికి జిల్లా పరిధిలో పశుసంవర్ధకశాఖ సిబ్బందితో 3 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశామని.. నిర్ధారిత ప్రామాణిక పత్రాలు (వాలిడ్ డాక్యుమెంట్స్) ఉంటేనే పరిశీలించి అనుమతిస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని శాంతిభధ్రతలకు విఘాతం కలిగించొద్దని.. ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా పరిష్కరించేందుకు పోలీస్ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారన్నారు. ముఖ్యంగా యువత ఆవేశంతో చేస్తున్న చిన్న తప్పులు శాంతిభద్రతల సమస్యగా తలెత్తే ప్రమాదం ఉందని.. మతపెద్దలు సమన్వయం పాటించేలా దిశా నిర్దేశం చేయాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో విధ్వేషాలు, రెచ్చగొట్టే, అసభ్యకర పోస్టులు చేసే వారిపై పోలీస్ మీడియా మానిటరింగ్ సెల్ నిఘా ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఇతర పోలీసు అధికారులు కూడా పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు పోలీసుశాఖ చర్యలను అభినందిస్తూ వంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, సీఐ సుగంధ రత్నం, పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్లపై వాహనాలు నిలుపొద్దు..
జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనదారులు రహదారి నిబంధనలు పాటించాలని అదనపు ఎస్పీ రాజేష్ మీనా కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో రోడ్డు మీద వాహనాలు నిలిపిన, దుకాణాల బోర్డులు ఏర్పాటుచేసి రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న దుకాణదారులు, వాహనదారులకు ఏఎస్పీ, డీఎస్పీ గిరిబాబు అవగాహన కల్పించారు. రోడ్డు అందరి సొత్తని.. ఒక్కరి సౌలభ్యం కోసం ఇతరులకు ఇబ్బందులు కలిగించొద్దని సూచించారు. రోడ్లను ఆక్రమించడంతో ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని.. అనవసర పార్కింగ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ వంటి తప్పులు ప్రమాదాలకు దారి తీస్తాయని వివరించారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు సహకరిస్తేనే ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.
అదనపు ఎస్పీ రాజేష్ మీనా


