గోపాల్‌పేట: ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ మంగళవారం మండలంలోని నర్సింగాయపల్లి బస్టాండు సమీపంలో రైతులు రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ సమీపంలో మెప్మా ఆధ్వర్యంలో సుమారు 20 రోజుల కిందట కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా నేటికీ ధాన్యం సరిగా కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. దీంతో కేంద్రంలో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు ధాన్యం తడిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే కొనుగోళ్లు పూర్తి చేయాలని కోరారు. విషయం తెలుసుకున్న గోపాల్‌పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అధికారులతో మాట్లాడించి బుధవారం కొనుగోళ్లు, తరలింపు జరిగేలా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.


