● రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి
వనపర్తి: రైతుల సంక్షేమం, దేశ రక్షణ, అణగారిన వర్గాల అభ్యున్నతికి చివరి శ్వాస వరకు పోరాడిన గొప్ప నాయకుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్.. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారితో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చిన్నారెడ్డి మాట్లాడుతూ.. డా. జగ్జీవన్‌రామ్ బాల్యం నుంచే దళితుల హక్కుల కోసం పోరాడిన మహానేత అని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే కేంద్రమంత్రిగా సేవలందించి దేశ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. గ్రీన్ రివల్యూషన్‌లో ఆయన పాత్ర కీలకమని, రక్షణ మంత్రిగా బంగ్లాదేశ్ విమోచన సమయంలో ఆయన నాయకత్వం ఎంతో గొప్పదని వివరించారు. ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. జిల్లాకేంద్రంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. భారత తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ దేశం గర్వించదగ్గ వ్యక్తి అని.. స్వాతంత్య్ర సమరంలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. సుమారు 30 ఏళ్లు అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. విద్యతోనే అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చని.. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తోందని.. స్వయం ఉపాధి పొందేందుకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు జగ్జీవన్‌రామ్ జీవితంపై పాడిన గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి రాంజీరావు, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, వ్యవసాయ మార్కెట్‌యార్డ్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, మహనీయుల ఉత్సవ కమిటీ నాయకులు గంధం నాగరాజు, చిరంజీవి, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు, వెంకటేష్, మాదారి భోజరాజు, గంధం గట్టయ్య, కృష్ణయ్య, వెంకట్‌గౌడ్, వెంకటేష్, విశ్వంబాబు, అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్, కౌన్సిలర్లు, ఆర్డీఎస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ తదితరులు పాల్గొన్నారు.


