‘రామన్నగట్టు’తోనే శాశ్వత పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

‘రామన్నగట్టు’తోనే శాశ్వత పరిష్కారం

Apr 6 2026 7:18 AM | Updated on Apr 6 2026 7:18 AM

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

పాన్‌గల్‌: గోపల్‌దిన్నె, సింగోటం లింక్‌ కెనాల్‌ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొల్లాపూర్‌, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని కిష్టాపూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రూ.150 కోట్ల లింక్‌ కెనాల్‌ పనులకు గుత్తేదారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కావడంతోనే పనుల్లో జాప్యం జరుగుతోందని.. జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తిచేస్తే 25 నెలల కాంగ్రెస్‌ ప్రభుత్వం మిగిలిన 10 శాతం పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. మండలంలోని కిష్టాపూర్‌ సమీపంలో రామన్నగట్టు రిజర్వాయర్‌ నిర్మాణానికి నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ఆయా పనులను రద్దు చేసిందని చెప్పారు. ఈ రిజర్వాయర్‌ నిర్మాణం చేపడితే మండలంతో పాటు వనపర్తి మండలంలోని పలు గ్రామాలకు శాశ్వతంగా సాగునీరు అందేదని తెలిపారు. దీంతోపాటు పాన్‌గల్‌కు 132 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ మంజూరు చేయిస్తే పనులు ప్రారంభించడం లేదన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ప్రశ్నిస్తే వారిపై కేసులు నమోదు చేయించి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓట్లప్పుడే రాజకీయాలు.. మిగతా సమయంలో అభివృద్ధిపై దృష్టి సారించేలా నాయకుల పనితీరు ఉండాలన్నారు. జల విద్యుత్‌ పేరిట శ్రీశైలం నీటిని ఏపీ ప్రభుత్వం దోచుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని.. నీటిపారుదలశాఖ మంత్రి, జిల్లా మంత్రి ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. ఇరిగేషన్‌శాఖ సలహాదారు ఏపీ ప్రభుత్వంలో కీలక వ్యక్తి కాబట్టే సాగునీటిని దోచుకుంటున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వీరసాగర్‌, మాజీ ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, నాయకులు చంద్రశేఖర్‌నాయక్‌, జ్యోతినందన్‌రెడ్డి, అడ్వకేట్‌ రవి, రాజేశ్వర్‌రెడ్డి, తిలకేశ్వర్‌గౌడ్‌, దశరథనాయుడు, భాస్కర్‌రెడ్డి, చంద్రూనాయక్‌, సర్పంచ్‌ కృష్ణనాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రాంచందర్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement