అప్రకటిత విద్యుత్ కోతలు
జిల్లాలో ఇష్టానుసారంగా నిలిచిపోతున్న సరఫరా
కానరాని పర్యవేక్షణ..
● రోజు పదుల సంఖ్యలో..
● ఇబ్బందులు పడుతున్న
వినియోగదారులు, చిరు వ్యాపారులు
● అధికారుల పర్యవేక్షణ కొరవడిందన్న
ఆరోపణలు
వనపర్తిటౌన్: జిల్లాలో విద్యుత్ కోతలు ఇష్టానుసారంగా విధిస్తున్నారు. సంబంధిత అధికారులు కనీస సమాచారం ఇవ్వకుండా సరఫరా నిలిపివేస్తుండటంతో వినియోగదారులు, చిరు వ్యాపారులకు ఇక్కట్లు తప్పడం లేదు. నెలలో ఒకట్రెండు సార్లు మాత్రమే అరగంట, గంట కోత విధిస్తున్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ.. అనధికారంగా లెక్కలేకుండా పోతోంది. రోజు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు 10 నుంచి 20 సార్లు కోతలు విధిస్తున్నారు. జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ సరఫరా నిలిచిపోతుండటంతో దుకాణదారులు, జిరాక్స్, ఇంటర్‌నెట్, మీసేవ కేంద్రాలు, ఫొటోస్టూడియోలు, ఫ్లెక్సీలు, ప్రింటింగ్ ప్రెస్, డయాగ్నోస్టిక్ కేంద్రాల నిర్వహకులతో పాటు కులవృత్తుల్లో యంత్రాలపై పనులు చేసేవారు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
చినుకు రాలినా.. గాలి వీచినా...
గాలి వీచినా, కొద్దిపాటి వర్షం కురిసినా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. క్షేత్రస్థాయిలో లైన్‌మెన్ల లోపమా.. అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యమా తెలియదు కానీ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. మోంథా తుపాను ప్రభావం కారణంగా మంగళ, బుధవారాల్లో అనధికార విద్యుత్ కోతలు విధించారు. రాత్రిళ్లు దోమల బెడదతో జ్వరాల బారిన పడే ప్రమాదం ఉందని.. విద్యుత్ కోతలు విధించడం సరికాదని వినియోగదారులు కోరుతున్నారు.
సంబంధిత అధికారులు పర్యవేక్షణ కొరవడంతో బ్రేక్‌డౌన్, ట్రాన్స్‌ఫార్మర్ ఫెయిల్, లోఓల్టేజీ తదితర సమస్యలు తలెత్తి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. అనధికారిక కోతలపై ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడం, వినియోగదారుల నుంచి విద్యుత్ సరఫరాపై సమాచారం తీసుకోకపోవడం తదితర కారణాలతో ఇష్టారీతి విద్యుత్ కోతలకు కారణమవుతున్నాయి.


