వేరుశనగ పంటను పరిశీలించిన పాలెం శాస్త్రవేత్తలు
లింగాల: మండలంలోని మగ్దూంపూర్, మాడాపూర్ గ్రామాల్లో శుక్రవారం పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు శంకర్, శోభ పర్యటించి వేరుశనగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా వేరుశనగ పంటలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్‌లో భాగంగా ఆయిల్ సీడ్స్ పథకం ద్వారా పీఏసీఎస్, అంబట్‌పల్లి ద్వారా రైతులకు పంపిణీ చేసిన జీజేజీ–32 రకం వేరుశనగ విత్తనాల మొలక శాతం, పంట పెరుగుదల, పంట స్థితి వంటి అంశాలను పరిశీలించారు. ఇది మేలు రకం విత్తనమని, సరైన రీతిలో పంటల సాగులో మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు వస్తాయని శాస్త్రవేత్తలు సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ చంద్రశేఖర్, ఏఓ అనిల్, ఏఈఓ భరత్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.
పంట నష్టంపై అంచనా..
మోంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు నష్టపోయిన వరి, వేరుశనగ, మొక్కజొన్న పంటలను శుక్రవారం మండల వ్యవసాయాధికారి అనిల్, ఏఈఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నష్టం వివరాలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని అధికారులు తెలిపారు.


