తుపాను బాధితులను ఆదుకోవాలి : సీపీఎం
పాన్‌గల్: మోంథా తుపానుతో వరి పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు బాల్‌రెడ్డి, మండల కార్యదర్శి బాల్యానాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ బృందం పాన్‌గల్, అన్నారంతండా, కేతేపల్లిలో పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించి మాట్లాడారు. భారీ వర్షాలకు చేతికంది వచ్చిన వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఓ పక్క తెగుళ్లు, మరోపక్క తుపాను ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వ్యవసాయ అధికారుల అంచనా ప్రకారం మండలంలో సుమారు 100 ఎకరాల వరకు పంట నష్టం వాటిల్లిందన్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వరి పంటలు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించాలన్నారు. ఈ నివేదిక ఆధారంగా బాధిత రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. లేనిపక్షంలో రైతుల వెంట ఉండి పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. పాన్‌గల్‌లో రైతు లింగాల రాములు పొలానికి అగ్గితెగులు సోకి గింజలు లేని పంటను వారు పరిశీలించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటయ్య, నిరంజన్, రైతులు ఉన్నారు.


