మధ్యాహ్న భోజనానికి గ్యాస్ సిలిండర్లు
వనపర్తి: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీకి గ్యాస్ సిలిండర్లు వినియోగించేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్రతి పాఠశాలకు ఎల్పీజీ కనెక్షన్ ఇప్పించేందుకు చొరవ చూపాలని, ఈ ప్రక్రియ నెల రోజుల్లో పూర్తయ్యేలా చూడాలన్నారు. అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారులు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు నిత్యం తనిఖీ చేపట్టాలని.. అక్టోబర్‌లో నిర్దేశించిన లక్ష్యాన్ని మరో రెండ్రోజుల్లో సాధించాలని సూచించారు. విద్యార్థుల అపార్ ఐడి జనరేషన్‌లో పురోగతి కనిపించిందని.. ఇంకా వేగంగా పూర్తి చేయాలన్నారు. గణితంలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయించడమే కాకుండా ఆ సమాచారాన్ని సంబంధిత పీఎం పోషణ్ పర్ఫామెన్స్ పోర్టల్‌లో నమోదు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ తదితరులు పాల్గొన్నారు.


