
‘కామారెడ్డి డిక్లరేషన్‌ను కప్పిపుచ్చేందుకే డ్రామాలు’
వనపర్తి విద్యావిభాగం: కామారెడ్డి డిక్లరేషన్‌ను కప్పిపెట్టే డ్రామాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతోందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ ఆరోపించారు. శనివారం జిల్లాకేంద్రంలోని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి నివాసంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పలుస రమేష్‌గౌడ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమళ్ల అశోక్‌తో కలిసి విలేకర్లతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకు ఆర్డినెన్స్ అంటూ మరోసారి మోసం చేస్తోందని.. ఆర్డినెన్స్ ద్వారా 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేటట్లు ఉంటే అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి ఎందుకు పంపించారని ప్రశ్నించారు. రాజ్యాంగ సవరణ, పార్లమెంట్ ఆమోదం తర్వాతే బీసీ రిజర్వేషన్లు అమలవుతాయని తెలిసి బీఆర్‌ఎస్ పార్టీని బద్నాం చేయడానికి కాంగ్రెస్‌పార్టీ కొత్త నాటకానికి తెర లేపిందన్నారు. కార్మిక, రైతు చట్టాలకు చట్టబద్ధత కల్పించినట్లుగానే బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి చట్టబద్ధత కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ విజయ్‌కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు వనం రాములు, వేణు యాదవ్, బొల్లెద్దుల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
కళాశాలల నిర్వహణకు నిధులు మంజూరు
వనపర్తి టౌన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల నిర్వహణకు రూ.2.30 లక్షలు ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృష్ణ ఆదిత్య మంజూరు చేశారని డీఐఈఓ ఎర్ర అంజయ్య శనివారం తెలిపారు. జూన్, జూలైకుగాను నిధులు విడుదలయ్యాయని.. ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ ఖాతాలో జమ చేసినట్లు వెల్లడించారు. వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.40 వేలు, బాలికల జూనియర్ కళాశాలకు రూ.30 వేలు, ఉర్దూ మీడియం కళాశాలకు రూ.12 వేలు, ఆత్మకూర్ కళాశాలకు రూ.24 వేలు, కొత్తకోట, పానగల్, పెద్దమందడి, ఖిల్లాఘనపూర్, శ్రీరంగాపూరం, వీపనగండ్ల, గోపాల్‌పేట ఒక్కో కళాశాలకు రూ.16 వేలు, పెబ్బేర్ కళాశాలకు రూ.12 వేలు మంజూరయ్యాయని.. ప్రిన్సిపాల్స్ కళాశాల కమిటీ సమన్వయంతో వినియోగించాలని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా కళాశాలల్లో క్రీడా సామగ్రి కొనుగోలుకు రూ.1.20 లక్షలు మంజూరుకాగా.. ఒక్కో కళాశాలకు రూ.10 వేల చొప్పున జమ చేసినట్లు వెల్లడించారు. కళాశాల కమిటీ నిర్ణయం మేరకు క్రీడా సామగ్రి కొనుగోలు చేసి ప్రతి శనివారం విధిగా క్రీడలు నిర్వహించాని సూచించారు.