
కార్యకర్తలకు అండగా ఉంటాం : బీరం
పాన్‌గల్: నియోజకవర్గంలోని అధికార పార్టీ నాయకులు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారని.. సంఘటితంగా ఎదుర్కొంటూ అండగా ఉంటామని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని జమ్మాపూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ ప్రజలను చైతన్యం చేయాలన్నారు. చిన్నంబావి మండలంలో మాజీ జెడ్పీటీసీ భర్త చిన్నారెడ్డిపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని.. ఈ ఘటనపై కోర్టును ఆశ్రయిస్తే అరెస్టు చేయకుండా నోటీసులు జారీ చేశారని తెలిపారు. ఇదే మండలంలోని చిన్నమారూర్‌లో యాదవులపై దాడి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా వారిపైనే కేసులు నమోదు చేసి భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. మండలంలోని రేమద్దులలో అధికార పార్టీ అండతో అక్రమార్కులు సాగునీటి కాల్వను ధ్వంసం చేసి మైనింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. మాజీ ఎంపీపీ మామిళ్లపల్లి శ్రీధర్‌రెడ్డి, పార్టీ నాయకులు చంద్రశేఖర్‌నాయక్, న్యాయమూర్తి రవికుమార్, జ్యోతినందన్‌రెడ్డి, సుధాకర్‌యాదవ్ పాల్గొన్నారు.
సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శం
వనపర్తి విద్యావిభాగం: భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ లలిత కళాతోరణంలో నిర్వహించిన గురుపౌర్ణమి వేడుకలకు ఆయన హాజరై మాట్లాడారు. గురు పూజోత్సవం సందర్భంగా వ్యాస మహర్షిని మనందరం పూజిస్తున్నామని తెలిపారు. గురువు లేకుండా శిక్షణ లేదని, చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే వారు, జ్ఞానోదయాన్ని కల్పించేవారు గురువని.. మనల్ని ఈ స్థాయిలోకి తీసుకొచ్చిన గురువులను స్మరించుకోవడం, వారిపట్ల కృతజ్ఞత భావంతో ఉండటం చాలా ముఖ్యమన్నారు. కవులు, ఉపాధ్యాయులు, కళాకారులు, సాహితీవేత్తలు, కరాటే మాస్టర్లను వారు సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, పెద్దిరాజు, మున్నూర్ రవీందర్, సీతారాములు, కుమారస్వామి, వెంకటేశ్వర్‌రెడ్డి, తిరుమల్లేష్, బచ్చు రాము, వెంకటేష్‌నాయుడు, రాజశేఖర్, కాటమోని కృష్ణగౌడ్, రాయన్న, ఉపేందర్‌యాదవ్, చంద్రశేఖర్, శివ పాల్గొన్నారు.
రామన్‌పాడులో
పెరిగిన నీటిమట్టం
మదనాపురం: రామన్‌పాడు జలాశయంలో గురువారం నీటిమట్టం కాస్త పెరిగిందని.. సముద్ర మట్టానికి పైన 1,020 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వల్లో 770 క్యూసెక్కుల వరద పారుతుందని చెప్పారు. రామన్‌పాడు జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 905 క్యూసెక్కులు, కుడి, ఎడమ కా ల్వలకు 45, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిన్నామని వివరించారు.

కార్యకర్తలకు అండగా ఉంటాం : బీరం