
మానవ మనుగడలో వృక్షాలే కీలకం
వనపర్తి: ప్రాణ వాయువునిస్తూ మానవ మనుగడలో వృక్షాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని.. వాతావరణ సమతుల్యత కాపాడుతున్న చెట్లను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవంలో భాగంగా బుధవారం జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో స్థానిక ఏకో పార్క్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, యాదయ్య, డీఎఫ్‌ఓ సత్యనారాయణతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతకు భూ భాగంలో 33 శాతం అటవీ ప్రాంతం ఉండాలని, ప్రస్తుతం జిల్లాలో 18 నుంచి 19 శాతం మాత్రమే ఉందని, పచ్చదనం పెంపొందించేందుకు ప్రజలందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇళ్ల ఆవరణలు, పొలాల గట్టు, ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటి సంరక్షించేలా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యార్థులు తీసుకోవాలని సూచించారు. ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు నిర్వహిస్తున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది 21 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా అధికారులు, విద్యార్థులు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
బైపాస్ రోడ్‌లో మార్నింగ్ వాక్..
జిల్లాకేంద్రంలోని కొత్తకోట రోడ్ నుంచి కర్నూలు రోడ్ వరకు బుధవారం ఉదయం ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ చేపట్టారు. ప్రజలకు ఉపయోగపడేలా బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. 44వ నంబర్ జాతీయ రహదారి నుంచి జిల్లాకేంద్రంలోని మెడికల్, నర్సింగ్ కాలేజీ, కోర్డులు, ఇతర కార్యాలయాలకు చేరుకునేందుకు సౌకర్యంగా మారనుందని తెలిపారు. రోడ్డు నిర్మాణంలో స్థలాలు కోల్పోయే వారితో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్‌పార్టీ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, నాయకులు కిచ్చారెడ్డి, మహేష్, కృష్ణ, పరశురాం తదితరులు పాల్గొన్నారు.