
మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి
కొత్తకోట రూరల్: జిల్లాలోని మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని నాబార్డ్ డీడీఎం పి.మనోహర్‌రెడ్డి కోరారు. బుధవారం మండలంలోని కనిమెట్టలో ఎస్‌ఐఆర్డీ ఎన్జీఓ కొత్తకోట ఆధ్వర్యంలో నిర్వహించిన మత్స్య రైతు ఉత్పత్తిదారుల సంఘ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎఫ్‌ఈఓ నిర్వహణకు నాబార్డ్ నిధులు రూ.27 లక్షలు మంజూరుకాగా, సభ్యుల పొదుపు, వాటాధనం ఆధారంగా రూ.15 లక్షలు ఈక్విటీ గ్రాండ్ మంజూరు చేస్తోందన్నారు. ఎఫ్‌ఈఓ లెక్కలు క్రమం తప్పకుండా నమోదు చేయాలని సూచించారు. సభ్యులు సంఘటితంగా ఉండి వాటా ధనం చెల్లిస్తే నాబార్డ్ ప్రతి సభ్యుడికి రూ.2 వేలు అందజేస్తుందని తెలిపారు. ఎఫ్‌ఈఓ ద్వారా చేపల ఆధారిత వ్యాపారం అభివృద్ధి చేసుకునేందుకు బ్యాంకుతో అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు. ముదిరాజ్ కమ్యూనిటీలో చేపల ఆధారితంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే సభ్యులకు లాభాలు వస్తాయో జిల్లా మత్స్యశాఖ అధికారి డా. బి.లక్ష్మప్ప వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబంలో ఆదాయం పెరుగుతుందని.. కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం, క్షేత్ర సందర్శన యాత్రలు చేపట్టి వ్యాపార కేంద్రాలను చూపిస్తామని, శిక్షణ కూడా ఇస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, వాకిటి బాలరాజు, గాదం పరమేశ్, పెంటయ్య, నరుకుల బాలన్న, నరుకుల శ్రీనివాసులు, మత్స్య సహకార సంఘం అధ్యక్షురాలు ఆకుల ఇందిరమ్మ, 11 మంది డైరెక్టర్లు, కురుమయ్య, పి.శ్రీనివాసులు సీఈఓ పి.అరుణ, ఎస్‌ఐఆర్డీ సిబ్బంది పాల్గొన్నారు.