ఆదర్శం.. అమరచింత నేతన్నలు
అమరచింత: స్థానిక చేనేత కార్మికుల సమష్టి కృషితోనే పట్టణంలోని చేనేత ఉత్పత్తుల సంఘం, రెడీమేడ్ వస్త్ర తయారీ కేంద్రాలు ఆర్థికంగా, వ్యాపారపరంగా ముందుకు సాగుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్‌రావు కొనియాడారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ఉపాధి శిక్షణ కేంద్రాల ఏర్పాటుకుగాను బుధవారం ఆయన పట్టణంలోని చేనేత ఉత్పత్తుల సంఘం, రెడీమేడ్ వస్త్ర తయారీ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. యువత, మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు త్వరలోనే మక్తల్‌లో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇదివరకే రెండుచోట్ల కేంద్రాలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని.. అమరచింతలోనూ ప్రభుత్వపరంగా వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకుగాను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. కార్మికులకు సరైన వేతనాలు లేక వృత్తికి దూరమవుతున్న తరుణంలో పట్టణానికి చెందిన మహంకాళి శేఖర్ నాబార్డు ఆర్థిక సహకారంతో స్వయంగా కంపెని స్థాపించి కార్మికులను భాగస్వాములను చేయడం సంతోషంగా ఉందన్నారు. దీంతోపాటు కుట్టులో అనుభవం ఉండి, ఉపాధి లేని మహిళల కోసం రెడీమేడ్ వస్త్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశారని వివరించారు. పలు రెడీమేడ్ కంపెనీలు వస్త్రాల తయారీకిగాను ముడి సరుకును పంపడంతో నిత్యం సుమారు 50 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారని కంపెనీ సీఈఓ మహంకాళి శేఖర్ ఎండీకి వివరించారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం కావాలన్న అందించేందుకు సిద్ధంగా ఉన్నా మని వేణుగోపాల్‌రావు హామీ ఇచ్చారు. సెట్విన్ జిల్లా కో–ఆర్డినేటర్ విజయ్‌కుమార్, చేనేత కార్మికులతో పాటు కాంగ్రెస్ నాయకులు అరుణ్, మహేందర్, తిరుమల్లేష్, వెంకటేశ్వర్‌రెడ్డి, తౌఫిక్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ఆదేశాలతో
స్వయం ఉపాధి శిక్షణ
కేంద్రాలు
సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్
వేణుగోపాల్‌రావు


