
ఆన్‌లైన్ వేదికలు.. టీనేజ్ ప్రేమలు
సోషల్ మీడియా ద్వారా కొత్త పరిచయాలు
● మైనర్ ఏజ్‌లోనే పెళ్లిళ్లు చేసుకుంటున్న వైనం
● ఆన్‌లైన్, మొబైల్ వినియోగంపై అప్రమత్తంగా ఉండాలంటున్న చైల్డ్ సేఫ్టీ అధికారులు
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెరుగుతున్న ఘటనలు
సాక్షి, నాగర్‌కర్నూల్: ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్, స్నాప్ చాట్, వాట్సప్.. తదితర సామాజిక మాధ్యమాల్లో నిత్యం గంటల తరబడి గడపడం ప్రస్తుతం టీనేజర్లకు సాధారణంగా మారింది. ఇదే క్రమంలో ఆన్‌లైన్ వేదికల ద్వారా కొత్తగా పరిచయం అయిన వారి పట్ల ఆకర్షితులవుతున్నారు. వీరిలో మైనర్లే ఎక్కువగా ఉంటున్నారు. బాల్య దశలోనే ప్రేమ పేరుతో ఇల్లు విడిచి వెళ్లిపోవడం, మైనర్ ఏజ్‌లోనే పెళ్లిళ్లు చేసుకుంటున్న ఘటనలు ఉమ్మడి జిల్లాలో తరచుగా చోటు చేసుకుంటున్నాయి. చాలావరకు ఘటనలు సంబంధిత అధికారుల దృష్టికి సైతం రావడం లేదు. తీరా మైనర్‌గా ఉన్న బాలికలకు వివాహతంతు పూర్తయ్యాక అధికారులకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి.
కఠిన నిబంధనలు ఉన్నా..
మైనర్ వివాహాలు జరిపిస్తే కఠినమైన చట్టాలు, నిబంధనలు ఉన్నప్పటికీ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మైనర్ పెళ్లిళ్లు కొనసాగుతున్నాయి. మైనర్ బాలికలను వివాహం చేసుకుంటే యువకుడు, బంధులవులతో పాటు బాధ్యులైన వారందరిపై కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. చాలాసందర్భాల్లో ఈ నిబంధనలు అమలుకావడం లేదు. మండలస్థాయిలో చైల్డ్ మ్యారేజీ ప్రొహిబిషన్ ఆఫీసర్లుగా సంబంధిత ఎమ్మార్వోలు, జిల్లాస్థాయిలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, సీ్త్ర,శిశు సంక్షేమ శాఖ అధికారులు పర్యవేక్షించాల్సి ఉండగా, చాలావరకు వివాహాలు జరిగాక కేవలం కౌన్సిలింగ్‌లకే పరిమితమవుతున్నారు. చిన్నవయసులోనే ఆన్‌లైన్ ద్వారా పరిచయాలు ప్రేమ వ్యవహారాలకు దారి తీస్తుండటంతో తల్లిదండ్రులే మైనర్ బాలికలకు గుట్టుగా వివాహాలు జరిపిస్తున్నారు. మరికొంత మంది మైనర్ దశలోనే ఆన్‌లైన్ పరిచయస్తులను నమ్మి ఇల్లు విడిచి వెళ్లిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.