కొత్తకోట రూరల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపడుతున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో నమూనా ఇందిరమ్మ ఇంటిని తహసీల్దార్ ఎం.వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించిన వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. అన్ని మండల కేంద్రాల్లో రూ.5 లక్షలతో నమూనా ఇందిరమ్మ ఇంటిని నిర్మిస్తున్నామని.. వాటిని చూసి అదే బడ్జెట్‌లో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు తహసీల్దార్ అనుమతితో ఉచితంగా ఇసుక పొందవచ్చన్నారు.
ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసే సమయంలో పంచాయతీ కార్యదర్శి ఫొటోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తారని, ఇల్లు నిర్మించుకునే వారు స్థానిక నాయకులు, పంచాయతీ కార్యదర్శికి సమాచారమిచ్చి పనులు ప్రారంభించాలని కోరారు. నిర్మాణం ప్రారంభించిన తర్వాత దశల వారీగా నగదు బ్యాంకు ఖాతాలో జమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో పుర కమిషనర్ సైదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి.కృష్ణారెడ్డి, ఎన్‌జే బోయేజ్, మేసీ్త్ర శ్రీనివాసులు, బీచుపల్లినాయుడు, శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక