
జూన్ 2 నుంచి రెవెన్యూ సదస్సులు
వనపర్తి: జిల్లాలోని అన్ని మండలాల్లో జూన్ 2 నుంచి భూ భారతి రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని.. ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పైలెట్ ప్రాజెక్టుగా గోపాల్‌పేట మండలంలో ఈ నెల 5 నుంచి రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయని చెప్పారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సిబ్బంది, తీసుకెళ్లాల్సిన రికార్డులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ధరణిలోని పెండింగ్ దరఖాస్తులను వెంటనే ఆర్డీఓ లాగిన్‌కు, అక్కడి నుంచి తన లాగిన్‌కు పంపించాలని ఆదేశించారు. భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించే నాటికి ధరణి లాగిన్‌లో పెండింగ్ ఉండకూడదని చెప్పారు. భూ భారతి చట్టంలోని నిబంధనలు, ధరణిలో పరిష్కారం కాని వాటిని ఎలా పరిష్కరించాలి.. తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా పైలెట్ మండలం గోపాల్‌పేటలో రెవెన్యూ సదస్సులకు వచ్చిన దరఖాస్తులు, పరిష్కారానికి ఉన్న అవకాశాలు, ఎదురైన సమస్యలను తహసీల్దార్ పాండు వివరించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు.
అనుమతి లేని ఇళ్లకు నోటీసులివ్వాలి..
ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టిన ఇళ్ల యజమానులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి పుర కమిషనర్లను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి లేఅవుట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డ్రాఫ్ట్ లే అవుట్ ఆమోదం పొంది ఫైనల్ లే అవుట్ ఆమోదానికి వచ్చిన దరఖాస్తులను కమిటీ సభ్యులు పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించిన రెండు లేఅవుట్లకు కమిటీ షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాలు అసంపూర్తిగా ఉన్న ఏడు దరఖాస్తులను పక్కనబెట్టారు. నిబంధనల ప్రకారం అన్ని మౌలిక వసతులు కల్పిస్తేనే కమిటీ ఆమోదం పొందుతుందన్నారు. అదనపు కలెక్టర్లు జి,వెంకటేశ్వర్లు, యాదయ్య, ఇరిగేషన్ ఇంజినీర్లు, ఆర్‌అండ్‌బీ డీఈ, టీపీఓలు, లే అవుట్ యజమానులు, ప్లానర్లు పాల్గొన్నారు.