వనపర్తి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్చి 2న ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారన్నారు. శిలా ఫలకాలు, బహిరంగ సభ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, తాగునీరు సరఫరా బాధ్యతలను పుర కమిషనర్‌కు అప్పగించారు. ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రం, జిల్లాలో జరిగిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ప్రసంగించనున్న నేపథ్యంలో మహిళా సంఘాల సభ్యులను సభాస్థలికి తీసుకొచ్చి తిరిగి వారి ఇళ్లకు సురక్షితంగా చేర్చే బాధ్యతలను అధికారులు, సిబ్బందికి అప్పగించారు. మండలాల వారీగా బస్సులు కేటాయించడం జరిగిందని, సభకు వచ్చే వారికి భోజనం, తాగునీరు, మజ్జిగ, కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి