
వనపర్తి: పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ను నిషేధించేలా పుర అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్టేట్ ఛాంబర్‌లో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, తహసీల్దార్ రాజేందర్‌గౌడ్‌తో ఆయన సమీక్ష నిర్వహించారు. హరిత ప్లాజా, రహదారి విస్తరణ పనులు, సెంట్రల్ లైటింగ్ తదితర అభివృద్ధి పనులపై చర్చించారు.
ఈటలతో ‘మేఘా’
మంతనాలు
వనపర్తి: జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం జిల్లాకేంద్రానికి వచ్చిన బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, చేరికల విభాగం రాష్ట్ర కన్వీనర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసిన జెడ్పీ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి, ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి, సర్పంచులు రహస్యంగా చర్చలు జరిపారు. గులాబీపార్టీకి రాజీనామా చేసి 20 రోజులైనా.. నేటికీ ఏ పార్టీలో చేరుతారో స్పష్టం చేయలేదు. ఈ సమయంలో ఈటలతో జరిపిన రహస్య చర్చలు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారన్న సంకేతాలు బయటకు పంపినట్లు తెలుస్తోంది. మరింతమంది ప్రజాప్రతినిధులు, తాజాలు, మాజీలను కలుపుకొని మరోపార్టీ తీర్థం పుచ్చుకోవాలనే వ్యూహరచన చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం
వనపర్తి: స్థానిక జెడ్పీ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు సీఈఓ శ్రావణ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయటం, జిల్లాలో 14 మండలాలుండగా.. 13 మండలాల్లో అధికార పార్టీ జెడ్పీటీసీ సభ్యులే ఉన్నారు. వీరంతా సమావేశానికి హాజరవుతారా లేక కోరం లేక వాయిదా వేసేలా.. గైర్హాజరవుతారా అనే అంశంపై జిల్లావ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.
అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా
వనపర్తి క్రైం: లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ముందున్న కారును తప్పించబోయి ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తాపడిన సంఘటన సోమవారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వనపర్తి నుంచి ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ జిల్లా కేంద్రంలోని భగీరథ చౌరస్తా సమీపంలో ముందున్న కారును తప్పించబోయి ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
